ఆద్యంతం నవ్వించే ‘లైలా’

'Laila' is always smiling.విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘లైలా’. ఈ సినిమాను దర్శకుడు రామ్‌ నారాయణ్‌ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈనెల 14న గ్రాండ్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ,’ట్రైలర్‌ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థియేటర్లలో మీరు నవ్వి నవ్వి మీ ఛాతీ చపాతీ కావాలని డిసైడ్‌ అయ్యాం. కచ్చితంగా ‘లైలా’ మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ట్రైలర్‌ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్‌ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా. ‘లైలా’ నుంచి నెక్ట్స్‌ ‘అటక్‌ పటక్‌’ సాంగ్‌ రిలీజ్‌ అవుతుంది. ఆ సాంగ్‌ నేనే రాశా. అది కూడా మీకు నచ్చుతుంది. ఈనెల 14న అందరం థియేటర్లలో కలుద్దాం’ అని చెప్పారు.
ఇదే వేడుకలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు టీమ్‌ సమాధానమిచ్చింది.
లైలా టార్గెట్‌ ఏంటి?
డైరెక్టర్‌ రామ్‌ నారాయణ్‌: ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే.
ట్రైలర్‌లో కొన్ని వల్గర్‌ డైలాగ్స్‌ ఉన్నాయి. మీ కామెంట్‌?
విశ్వక్‌ సేన్‌: ప్రతి సినిమా ఒకేలా తీయలేం కదా.. ఇదొక వెరైటీ సినిమా. అందుకే ఇలా ట్రై చేశాం. పైగా నేను ఈ సినిమాలో లేడీ గెటప్‌ వేసింది ఎంటర్‌టైన్‌ చేయడానికి. మా ఇంటెన్షన్‌ కేవలం మిమ్మల్ని నవ్వించడమే. అందులో భాగంగానే కొన్ని డైలాగ్స్‌ ఉన్నాయి. యూత్‌కు పవర్‌ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది.
ఈ సినిమాలో మీ రోల్‌ ఏలా ఉంటుంది?
కామాక్షి భాస్కర్ల: నా క్యారెక్టర్‌ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్‌ రోల్స్‌ చేస్తుందనే మార్క్‌ ఉంది. ఆ మార్క్‌కు తగ్గట్లే ఇందులో నా పాత్ర ఉంటుంది. ఆ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌ రామ్‌ నారాయణ్‌దే.
విశ్వక్‌ సేన్‌తో మీ వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
డాన్స్‌ మాస్టర్‌ భాను: ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేశాను. ఫస్ట్‌ సాంగ్‌ సోనూ మోడల్‌ పెద్ద హిట్‌ అయింది. అలాగే లాస్ట్‌ సాంగ్‌ కోయి కోయిని కూడా హిట్‌ చేశారు. ప్రతి సాంగ్‌ సందర్భానుసారం ఉంటుంది.