– వేడుకగా హైబిజ్ టివి టీ ఛాంపియన్‌షిప్
నవ తెలంగాణ – హైదరాబాద్
విభిన్న కార్యక్రమాల నిర్వహించే హైబిజ్ టివి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టీ ఛాంపియన్‌షిప్ – 2024ను ఏర్పాటు చేసింది. నగరంలోని హెచ్‌ఐసిసిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్నారు. రుచికరమైన ఛారు పెట్టేందుకు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి రూ. 50 వేలు, మూడో బహుమతి రూ. 25 వేలు చొప్పున అందజేశారు. తరువాతి 5 స్థానాల్లో నిలిచిన వారికి తలో రూ. 10 వేలు ఇచ్చారు. తొలి బహుమతి కె జ్యోత్స్న, రెండో బహుమతి కె వరలక్ష్మీ, మూడో బహుమతిని పి జ్యోత్స్న దక్కించుకున్నారు. తర్వాత ఐదు స్థానాల్లో ప్రియాంకా పాండే, షైలీ మానియర్, ఎం. గీత, రూపా బాల్, ఎన్. రాణి నిలిచారు. ఈ కార్యక్రమంలో హైబిజ్ టివి ఎండి ఎం రాజ్ గోపాల్, సిఇఒ జె సంధ్యారాణి, నటీ సుమయా రెడ్డి, చక్రమిల్క్ సిఇఒ పి బ్రహ్మయ్య, క్రెడారు నేషనల్ జనరల్ సెక్రటరీ జి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.