మండలంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో మంగళవారం లక్ష తులసి దళలతో విశేష అర్చన నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకులు సముద్రాల అమర్నాథా చార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేశారు. వేద పండితుడు రాష్ట్ర అవార్డు గ్రహీత గురుమంచి చంద్ర శేఖర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నారాయణుల ఉత్సవమూర్తులకు వేదక్తంగా పంచామృత అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలోని మూల విరాట్టులకు విష్ణు సహస్ర నామాలతో లక్ష తులసిదళ అర్చన చేశారు. రెండు గంటల పాటు భక్తులు ఓం నమో నారాయణాయ అంటూ భక్తితో నామస్మరణలో మునిగిపోయారు. మహా నైవేద్యం, హారతి అనంతరం భక్తులు అందరికి ప్రసాదంగా తులసి దళాలు, పండ్లతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా అర్చకులు అమర్నాథ చారి, ప్రముఖ వేద పండితులు చంద్రశేఖర్ శర్మ లు మాట్లాడుతూ కార్థిక శుద్ధ ఏకాదశి గురించి వివరించారు. తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లే శ్రీమన్నారాయణుడు ఈ రోజున మేల్కొంటారని, ఈ రోజు చేసిన పూజలు వేయి రేట్ల ఫలితం ఇస్తాయన్నారు. ఉపవాసం అంటే ఆహరం తినకుండా ఉండటం కాదని భగవంతుడికి దగ్గరగా వుండి నవ విధ భక్తి మార్గాలలో దేని ద్వారా అయినా స్వామి కి సేవ చేసుకోవాలని అన్నారు.