లక్ష్యసేన్‌ పోరాడినా..!

– సెమీస్‌లో పరాజయం
– థారులాండ్‌ ఓపెన్‌
బ్యాంకాక్‌ : థారులాండ్‌ ఓపెన్‌లో టీమ్‌ ఇండియా పతక వేటకు తెరపడింది. మెన్స్‌ సింగిల్స్‌లో యువ కెరటం లక్ష్యసేన్‌ జైత్రయాత్రకు సెమీఫైనల్లో బ్రేక్‌ పడింది. రెండో సీడ్‌, థారులాండ్‌ షట్లర్‌ కునాల్‌వట్‌ విటిడ్‌శరన్‌తో మూడు గేముల మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ పోరాడి ఓడాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 21-13, 17-21, 13-21తో థారులాండ్‌ షట్లర్‌కు ఫైనల్స్‌ బెర్తె కోల్పోయాడు. 75 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్‌ తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గాడు. 11-6తో ముందంజలో నిలిచి అదే జోరులో 21-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ రెండో గేమ్‌లో రెండో సీడ్‌ థారులాండ్‌ షట్లర్‌ పుంజుకున్నాడు. 17-15తో ముందంజలో నిలిచిన లక్ష్యసేన్‌ను వెంబడించిన కునాల్‌విట్‌.. 17-17తో స్కోరు సమం చేశాడు. వరుసగా మూడు పాయింట్లతో 21-17తో రెండో గేమ్‌ను గెల్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో లక్ష్యసేన్‌ అంచనాలను అందుకోలేదు. 11-10తో ముందంజ వేసినా.. విరామం అనంతరం లయ కోల్పోయాడు. వరుస పాయింట్లు సాధించిన కునాల్‌విట్‌ 21-13తో నిర్ణయాత్మక మూడో గేమ్‌తో పాటు ఫైనల్స్‌ బెర్త్‌ కైవసం చేసుకున్నాడు.