సెమీస్‌లో లక్ష్యసేన్‌

– జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
-క్వార్టర్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఓటమి
-హెచ్‌.ఎస్‌ ప్రణరుకి తప్పని భంగపాటు
టోక్యో (జపాన్‌) : భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ హ్యాట్రిక్‌ కొట్టాడు. వరుసగా మూడో డబ్ల్యూబీఎఫ్‌ టూర్‌ సిరీస్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌ కుర్రాడు కోకి వాటనబెపై వరుస గేముల్లో గెలుపొందాడు. 21-15, 21-19తో లోకల్‌ షట్లర్‌ను చిత్తు చేసిన లక్ష్యసేన్‌ మెన్స్‌ సింగిల్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెనడా ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన లక్ష్యసేన్‌.. తాజాగా మూడో టోర్నీలోనూ సెమీఫైనల్లో ప్రవేశించి సత్తా చాటాడు. కొరియా ఓపెన్‌ చాంపియన్స్‌ సాత్విక్‌, చిరాగ్‌ జోడీ సహా సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు క్వార్టర్‌ఫైనల్లో పరాజయం పాలయ్యారు.
హ్యాట్రిక్‌ సేన్‌! : వరల్డ్‌ నం.33 జపాన్‌ షట్లర్‌ను లక్ష్యసేన్‌ చిత్తు చేశాడు. 47 నిమిషాల్లోనే క్వార్టర్స్‌ మ్యాచ్‌లో గెలుపొందిన లక్ష్యసేన్‌ నేడు సెమీఫైనల్లో ఐదో సీడ్‌ ఇండోనేషియా షట్లర్‌ జొనాథన్‌ క్రిస్టీతో తలపడనున్నాడు. తొలి గేమ్‌ ఆరంభంలో జపాన్‌ షట్లర్‌ నుంచి లక్ష్యసేన్‌కు పోటీ ఎదురైంది. కానీ 11-7తో విరామ సమయానికి సేన్‌ ముందంజ వేశాడు. ద్వితీయార్థంలో లోకల్‌ ప్లేయర్‌ పెద్దగా ప్రతిఘటించలేదు. రెండో గేమ్‌లో కొకి పుంజుకున్నాడు. 11-6తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచాడు. 16-10తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నట్టే కనిపించాడు. కానీ చివర్లో అసమాన ప్రదర్శన చేసిన లక్ష్యసేన్‌ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి అంతరాన్ని కుదించాడు. 17-17తో స్కోర్లు సమం చేశాడు. 19-18తో కొకి ముందంజ వేసినా.. చివర్లో వరుసగా మూడు పాయింట్లు కొల్లగొట్టి 21-19తో రెండో గేమ్‌ను, సెమీఫైనల్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.
పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు పరాజయం పాలయ్యారు. చైనీస్‌ తైపీ జోడీ చేతిలో మూడు గేముల్లో ఓటమి చెందారు. 15-21, 25-23, 16-21తో మనోళ్లు వెనుకంజ వేశారు. మెన్స్‌ సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు సైతం మూడు గేముల పోరాటంలో తలొంచాడు. టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (డెన్మార్క్‌)తో క్వార్టర్స్‌ పోరులో 21-19, 18-21, 8-21తో ప్రణరు పోరాడి ఓడాడు.