లక్ష్యసేన్‌ పరాజయం

– యుఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
కౌన్సిల్‌ బ్లఫ్స్‌ (యుఎస్‌ఏ) : భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ యుఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో పోరాడి ఓడాడు. గత వారం కెనడా ఓపెన్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ లి షి ఫెంగ్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన లక్ష్యసేన్‌.. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో అతడి చేతిలో మూడు గేముల పోరాటంలో తలొగ్గాడు. 76 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీఫైనల్‌ పోరులో మూడో సీడ్‌ లక్ష్యసేన్‌ 17-21, 24-22, 17-21తో రెండో సీడ్‌ ఫెంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్‌లో ఓటమి అంతరం తక్కువే కానీ.. లక్ష్యసేన్‌ అంచనాలను అందుకోలేదు. ఏ దశలో ఫెంగ్‌పై ఆధిపత్యం చూపించలేదు. 11-7తో విరామ సమయానికి ముందంజ వేసిన ఫెంగ్‌.. ద్వితీయార్థంలోనూ దూసుకెళ్లి తొలి గేమ్‌ను నెగ్గాడు. ఇక ఉత్కంఠగా సాగిన రెండో గేమ్‌ను టైబ్రేకర్‌లో లక్ష్యసేన్‌ సొంతం చేసుకున్నాడు. 10-11తో విరామ సమయానికి వెనుకంజ వేసిన లక్ష్యసేన్‌.. ఆ తర్వాత పుంజుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 13-13తో ఫెంగ్‌ స్కోరు సమం చేయగా.. ఇక అక్కడ్నుంచి నువ్వా నేనా అన్నట్టు సాగింది మ్యాచ్‌. 20-20 వద్ద స్కోర్లు సమమైన వేళ వరుసగా రెండు పాయింట్లతో లక్ష్యసేన్‌ ముందంజ వేశాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో లక్ష్యసేన్‌ నిరాశపరిచాడు. ఏ దశలోనూ ఫెంగ్‌కు గట్టి పోటీ ఇవ్వలేదు. మూడో గేమ్‌తో పాటు ఫైనల్స్‌ బెర్త్‌ దక్కించుకున్న ఫెంగ్‌ కెనడా ఓపెన్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు!. లక్ష్యసేన్‌ ఓటమితో యుఎస్‌ ఓపెన్‌లో భారత పతక ఆశలకు తెరపడింది.