– సెమీస్‌లో ఓడిన యువ షట్లర్
– జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్
టోక్యో (జపాన్) : భారత బ్యాడ్మింటన్ యువ షట్లర్, కెనడా ఓపెన్ చాంపియన్ లక్ష్యసేన్ నిరాశపరిచాడు. బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో వరుసగా మూడో టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరుకుని సత్తా చాటిన లక్ష్యసేన్.. జపాన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టలేకపోయాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ మూడు గేముల పోరాటంలో పరాజయం పాలయ్యాడు. ఐదో సీడ్, ఇండోనేషియా షట్లర్ జొనాథన్ క్రిస్టీ 21-15, 13-21, 21-16తో లక్ష్యసేన్‌పై పైచేయి సాధించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్ సమరంలో చివరి వరకు లక్ష్యసేన్ రేసులోనే నిలిచాడు. తొలి గేమ్‌లో 12-11తో ముందంజలో నిలిచినా.. లక్ష్యసేన్ జోరు కొనసాగించలేదు. చివర్లో లయ కోల్పోయాడు. తొలి గేమ్ చేజార్చుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో లక్ష్యసేన్ గొప్పగా పుంజుకున్నాడు. విరామ సమయానికి 11-4తో భారీ ఆధిక్యంలో నిలిచాడు. ద్వితీయార్థంలోనూ దుమ్మురేపి ఏకపక్షంగా రెండో గేమ్‌ను గెల్చుకున్నాడు. సెమీఫైనల్ ఫైట్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. విరామ సమయానికి 7-11తో వెనుకంజ వేసిన లక్ష్యసేన్.. ద్వితీయార్థంలో అంచనాలను అందుకోలేదు. సహజంగా వెనుకంజలో నిలిచినా.. ప్రత్యర్థిని గేమ్ పాయింట్ వద్ద నిలబెట్టి విజయాలు సాధించిన రికార్డు లక్ష్యసేన్ సొంతం. కానీ జపాన్ ఓపెన్‌లో లక్ష్యసేన్ ఆ ప్రదర్శన పునరావృతం చేయలేకపోయాడు. 21-16తో మూడో గేమ్‌ను, ఫైనల్స్ బెర్త్‌ను జొనాథన్ క్రిస్టీ దక్కించుకున్నాడు. మరో సెమీఫైనల్లో నాల్గో సీడ్ కొడారు నరొక (జపాన్)పై టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) 21-11, 21-11తో అలవోక విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 తైజు యింగ్‌పై కొరియా స్టార్ అన్ సె యంగ్ 21-17, 21-12తో గెలుపొందగా, మరో సెమీస్‌లో గ్రెగోరియ (ఇండోనేషియా)పై హీ బింగ్జియావో (చైనా) 13-21, 21-19, 21-9తో పైచేయి సాధించింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్లో యంగ్‌తో హీ బింగ్జియావో తలపడనుంది.