లాల్‌రెమ్సియామి హ్యాట్రిక్‌

ఇంగ్లాండ్‌పై 3-0తో భారత్‌ గెలుపు
బార్సిలోనా (స్పెయిన్‌) : భారత హాకీ స్టార్‌, స్ట్రయికర్‌ లాల్‌రెమ్సియామి హ్యాట్రిక్‌తో రెచ్చిపోయింది. మూడు గోల్స్‌తో లాల్‌రెమ్సియామి మెరువగా ఇంగ్లాండ్‌పై భారత్‌ 3-0తో ఘన విజయం సాధించింది. స్పానీశ్‌ హాకీ ఫెడరేషన్‌ శత వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ హాకీ టోర్నీలో స్పెయిన్‌ సహా ఇంగ్లాండ్‌, భారత్‌ పాల్గొంటున్నాయి. టోర్నీ తొలి రెండు మ్యాచుల్లో టీమ్‌ ఇండియా అమ్మాయిలు డ్రా దాటి ముందుకెళ్లలేకపోయారు. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌ 1-1తో, స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిశాయి. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో లాల్‌రెమ్సియామి మెరుపులతో టోర్నీలో భారత్‌ తొలి విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్‌కు గోల్‌ అవకాశాలు లభించినా.. భారత డిఫెన్స్‌ను ఛేదించలేదు. 13, 17, 56వ నిమిషంలో గోల్స్‌ కొట్టిన లాల్‌రెమ్సియామి పాయింట్ల పట్టికలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపింది.కెప్టెన్‌ సవిత, నేహా గోయల్‌, దీప్‌ గ్రేస్‌ ఎక్కాలు రాణించారు. నేడు జరిగే మరో మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్‌ తలపడనుంది.