సత్యలోకంలో ఆహ్లాదరక వాతావరణం ఉన్నది. సృష్టి కార్యక్రమం ముగించిన బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుం టున్నాడు. సరస్వతిదేవి వీణ మీటుతుంటే బ్రహ్మదేవుడు తన్మయత్వంతో కండ్లు మూసుకున్నాడు. వీణా నాదంతో కాలం కమ్మగా గడిచిపోతున్నది. బ్రహ్మదేవుడు వీణా నాదామృతాన్ని గ్రోలుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి వీణానాదం ఆగిపోయింది. అప్పటిదాకా తన్మయత్వంలో మునిగితేలుతున్న బ్రహ్మదేవుడు ఆగ్రహంతో కండ్లు తెరిచాడు. వీణానాద భంగానికి కారకులైన వారిని శపించాలని చూశాడు. అక్కడెవరూ కనబడలేదు! అప్పటిదాక వీణానాదం చేసిన సరస్వతిదేవి కూడా కనబడలేదు! ఎవరో భక్తులు చేసిన తపస్సు సఫలీకృతం చేయడానికి వెళ్లి ఉండవచ్చుననుకున్నాడు.
చాలాకాలం గడిచింది. కాని సరస్వతి తిరిగి రాలేదు. బ్రహ్మదేవుడు దివ్యదృష్టితో చూశాడు. కాని బ్రహ్మదేవుడి దివ్యదృష్టికి సరస్వతి అందలేదు. బ్రహ్మదేవుడికి ఆందోళన మొదలైంది. ఉన్నట్టుండి సరస్వతి అంతర్థానం కావడమెందుకు? తనతో ఒక్కమాటైనా చెప్పి వెళ్లవచ్చుగదా! ఈ ఆడవాళ్లతో ఇదే తంటా! ఎప్పుడేం చేస్తారో తెలియదు కదా! అని విసుక్కున్నాడు. ఏదేమైనా సరస్వతి వెళ్లిపోయింది. ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో! ఈ ఆలోచన రాగానే బ్రహ్మదేవుడికి భయమేసింది. తన భార్య లేకుండా సృష్టిచక్రం ఎలా నడుస్తుంది? ఈ సమ్యను ఎలా పరిష్కరించుకోవాలని తర్జనభర్జన పడ్డారు. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు సహాయాన్ని అర్థించాలని వైకుంఠం బయలుదేరాడు. వైకుంఠ ద్వారంలోనే నారదుడు ఎదురుపడి బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. అటు ఇటూ చూశాడు.
”ఏమిటిది పితృదేవా! మా తల్లిగారేరి?” అడిగాడు నారధుడు.
బ్రహ్మదేవుడు మౌనంగా ముందుకుసాగి శ్రీమహావిష్ణువు సన్నిధికి చేరుకుని తన సమస్యను విన్నవించుకున్నాడు.
”మా తల్లిగారికి ఏనాడూ ఆగ్ర హం కలగలేదు! అలకబూనలేదు! కాని ఇప్పుడు అదృశ్యమయ్యారు. మా తల్లిగారి దర్శనం చేయించి నాకు స్వాంతన ప్రసాదించండి ప్రభూ!” అని శ్రీ మహావిష్ణువును వేడుకున్నాడు నారదుడు.
శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి. ”మా కోడలిని ఏదైనా మాట అన్నావా బ్రహ్మదేవా?” అని అడిగాడు.
”లేదు తండ్రీ, ఆమెను ఏ మాటా కలలో కూడా అనలేదు. ఈ దృష్టిలో ఆమె విలువ తెలిసినవాడిని కదా!” అన్నాడు బ్రహ్మదేవుడు చేతులు జోడించి.
శ్రీ మహావిష్ణుడు దివ్యదృష్టితో పరిశీలించాడు. ఆయనకు సాధ్యం కానిదేమున్నది? సరస్వతి దేవి ఎక్కడున్నదో అర్థమైంది! వెంటనే బయలుదేరాడు. మిగలిన వాళ్లంతా అనుసరించారు. సరస్వతిదేవి ఉన్న ప్రాంతానికి చేరు కున్నారు. ఆ ప్రాంతాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్య పోయాడు.
ఆ ప్రాంతం తను సృష్టించింది కాదు. నిర్జన ప్రదేశం. చెట్లూ చేమలు, నీరు ఏమీ లేవు. అసలక్కడ ఏమీ లేదు. ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని సరస్వతీదేవి కన్నీరు, మున్నీరుగా రోదిస్తున్నది. ఆమెను ఆ స్థితిలో చూసి అందరి హృదయాలు కదిలిపోయాయి. నారదుడు ఒక్క ఉదుటున వెళ్లి సరస్వతిదేవి పాదాలు బిగ్గరగా పట్టుకున్నాడు.
”సకలలోక పూజితవు! సకల ప్రాణులకు జ్ఞాన ప్రదాతవు నీవు ఎందుకమ్మా రోదిస్తున్నావు! నీ రోదనకు కారణమేమి?” అంటూ బాధపడ్డాడు.
”దేవీ, నీవు ఎందుకు బాధపడుచుంటివి? నీ బాధకు కారణమైన వారిని సర్వనాశనం గావించెదను!” అన్నాడు బ్రహ్మదేవుడు ఆగ్రహంగా,
”బ్రహ్మదేవా శాంతించు! సృష్టి మాత్రమే నీవు చేయగలవు. అందునా ఇది కలియుగము. నీ పరిమితులు నీవు గుర్తించవలె. ముందు సరస్వతి బాధకు గల కారణమేమిటో తెలుసుకుందాం!” అంటూ శ్రీమహావిష్ణువు సరస్వతి దేవి వైపు చూశాడు.
సరస్వతిదేవి లేచి నిలబడింది. శ్రీ మహావిష్ణువుకు నమస్కరించింది.
”దేవాధిదేవా! నీకు తెలియని రహస్యము ఏమున్నది? నా బాధ కారణము ఎవరో నీకు తెలియనిదా? నాతో చెప్పింతువా! నిజమే నా బాధకు, రోదనకు కారణమేవరో నేనే చెప్పవలె. ఎంతోకాలంగా నాలో నేనే బాధపడు చుంటిని. కాని ఇపుడు ఆ బాధ పతాకస్థాయి చేరినది. అందుకే సత్యలోకమే, ఈ విశ్వాన్నే వీడివచ్చితిని. నా బాధ, రోదనకు కొందరు మనుషులే కారణము!” అన్నది సరస్వతి దుఃఖిస్తూనే.
”ఏమిటి కొందరు మానవులే నీకింత బాధ కల్గించినారా? ఎవరా మానవులు?” ఆగ్రహంగా అడిగాడు బ్రహ్మదేవుడు.
”దేవా! ఆ మానవులు నీవు సష్టించిన వారే! వారే నా బాధకు కారకులు! మొన్న హైదరాబాదులో జరిగిన పుస్తకప్రదర్శనలో నాపై దాడి చేసి, నా పట్ల అసభ్యకరముగా, అవమానకరముగా కొందరు వ్యవహరించినారు! అదే నా బాధకు కారణం!” అన్నది సరస్వతిదేవి.
”తల్లి, ఆ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు విక్రయించే వారిపై దాడి కొందరు ఆగ్రహించినారు! కాని నీ మీద దాడి జరిగినట్టు లేదు కదా!’ అన్నాడు నారదుడు.
”పిచ్చి నారదా! పుస్తక విక్రేతలు, పుస్తక రచయితలు ఇలా అందరిపై దాడి జరుగుతున్నది.తన భావజాలం లొంగిఉండని వారిపైనా, వేరే భావజాలం కలిగి ఉన్నవారిపైనా వారు దాడి చేస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే, వారి దాడి వ్యక్తులపైనా, విక్రేతలపైనా, రచయితలపైనా కాదు. తమకు నచ్చని భావజాలంపై వారు దాడి చేస్తున్నారు. భావజాలంపై దాడి జరగటం అంటే అది నాపై జరుగుతున్న దాడే!” అన్నది సరస్వతి
”తల్లి నాదో సందేహం! భావజాలంపైన జరుగుతున్న దాడి నీపై దాడి ఎలా అవుతుంది?” ప్రశ్నించాడు నారదుడు.
”భావజాలం రూపొందటానికి, స్థిరపడటానికి జ్ఞానమే కారణం! జ్ఞానమంటేనే నేను కదా?” అన్నది సరస్వతిదేవి.
”అది నిజమే అయితే నాకు మరో సందేహం! ఎవరైతే దాడికి పాల్పడ్డారో. వారికి కూడా ఒక భావజాలం ఉన్నదికదా ! ఆ భావజాలానికి కూడా జ్ఞానమే కారణం కదా ! మరి రెండు వైపులా నీవు అంటే జ్ఞానమే ఉన్నది కదా! ఒక జ్ఞానము మరీ జ్ఞానముపై దాడి చేస్తున్నది. చూద్దాము! ఏ జ్ఞానము లేదా ఏ భావజాలము విజయం సాధిస్తుందో!” అన్నాడు నారదుడు.
అంత బాధలోనూ సరస్వతి దేవి నవ్వింది!
”పిచ్చి నారదా! ఎవరైతే దాడులు చేస్తున్నారో వారి భావజాలానికి జ్ఞానం కారణం కాదు! అజ్ఞానమే కారణం! ఏ విషయాన్నైనా పరిశోధించి, నిజానిజాలు తెలుసుకోవటమే జ్ఞానం! ఏ పరీక్షలకైనా ఒకే ఫలితాన్ని సాధిస్తే దాన్ని జ్ఞానం అంటాము! దాడులు చేస్తున్న వారిది జ్ఞానంకాదు! మూఢత్వం! ఎవరో చెప్పింది విని, వాట్సాప్ యూని వర్సిటీలో నేర్చుకుని ఇతరుల భావజాలంపై దాడి చేస్తున్నారు!” అన్నది సరస్వతి దేవి.
”మరి దీనికి పరిష్కారమేమిటి?’ బేలగా అడిగాడు బ్రహ్మదేవుడు.
”విద్యకు, జ్ఞానానికి విలువలేకుండా పోయింది. జ్ఞానాన్ని నేర్పించే గురువు చేత శిష్యుడి కాళ్లు పట్టించారు. ఆ శిష్యుడు అయ్యప్పమాలలో ఉన్నందున గురువుచేత కాళ్లు పట్టించారు! మరి మీరు రామావతారం, శ్రీ కష్ణా వతారం దాల్చినపుడు గురు వు కాళ్లు పట్టుకున్నారు! ఈ విషయం ఈ మూఢులు పక్కన పెట్టారు. ప్రతిక్షణం ఇలాం టివే భారతదేశంలో జరుగుతుంటే, అక్కడ నేనెలా ఉండగలను?” ప్రశ్నించింది సరస్వతి దేవి ఆవేదనతో.
శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు.
”ఇంతకు ముందు నీవు చెప్పిందే నిజం! మూఢులు, అజ్ఞానులే జ్ఞానంపైన దాడులకు పాల్పడుతున్నారు. అంటే దీని పరమార్థం ఏమిటి, భారతదేశంలో అజ్ఞానం, మూఢత్వం ఎక్కువగా ఉన్నాయి. అందుకే దాడులు పెరుగు తున్నాయి. దాడులు తగ్గాలంటే జ్ఞానం పెరగాలి! అంటే దేశం నలుమూలలా జ్ఞానం విస్తరించాలి. దాడులు చేసే మూఢులకు కూడా జ్ఞానోపదేశం చేయాలి.ఆ జ్ఞానపదేశం జరగాలంటే నీవు సత్యలోకంలో కాదు భారతదేశంలో నీవు నివసించాలి! అదే నీ కర్తవ్యం!” అంటూ సరస్వతీదేవిని భారతదేశానికి పంపించాడు శ్రీమహావిష్ణువు.
– ఉషాకిరణ్