భూ పోరాటాలను

ఉధృతం చేయండి : జి.నాగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం, సాగుభూమి, పోడు భూముల హక్కు పట్టాల కోసం భూ పోరాటాలను ఉధృతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో వ్యకాస రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ..గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి జాగా పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోడు సాగుదారులందరికీ హక్కు పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వాలు అనేక మందికి ఇండ్ల పట్టాలిచ్చారనీ, వారికి భూమిని చూపించకపోవడం వల్ల పట్టాలు పేదవాళ్ల చేతుల్లో ఉన్నాయనీ, నివాస భూమి లేక కిరాయి ఇండ్లలో బతకలేక అల్లాడుతున్నారని చెప్పారు. పాత ఇంటి జాగా పట్టా ఉన్న వాళ్లకు ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నారిఐలయ్య, బి.ప్రసాద్‌, మచ్చ వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.పద్మ, కె.జగన్‌, ఆర్‌.శశిధర్‌, నరసింహులు, వెంకటయ్య, గోపాల్‌, ఎం.ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.