సూర్యాపేటలో భూకబ్జా ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి

నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న భూ కబ్జా ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మార్జున్‌ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒకవైపు బీఆర్‌ఎస్‌ నాయకుడు, మంత్రి అనుచరుడు వట్టెజానయ్యయాదవ్‌ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా భూ బాధితులు రోడ్డు మీదికెక్కితే మరొక బీఆర్‌ఎస్‌ నాయకుడు, మంత్రి అనుచర బృందం బాధితులకు సహాయం చేస్తామంటూ బేరాలు చేసుకుంటూ కొత్త దందాకు తెరలేపాడని ఆరోపించారు.తెలిసో.. తెలియకో జానయ్య వద్ద, అతని బందువుల వద్ద, అతని అనుచరుల వద్ద భూములు కొనుగోలు చేసిన వారి పైన, కిరాయికి వున్న వారిపై దాడులు చేయడం సరికాదన్నారు.న్యాయవాది తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మల్లయ్యయాదవ్‌ అంజనాపురికాలనీలో అద్దెకు తీసుకొని నివసిస్తున్న ఇంటి పైకి పదిరోజుల కింద బీఆర్‌ఎస్‌ నాయకుడు జేసీబీలు, 50 మంది అనుచరులతో దాడి చేసి ఇంటి కాంపౌండ్‌ ధ్వంసం చేస్తుండగా మాండ్ర మల్లయ్య ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించాడన్నారు.కాగా ఈ ఇంటి స్థలం వేరే వాళ్ళదని అందుకనే గోడ కూలుస్తున్నామని చెప్పగా తాము కిరాయికి ఉన్నామని ఏమైనా సమస్యలు ఉంటే ఇంటి ఓనర్‌ తో మాట్లాడుకోవాలని చెప్పడం జరిగిందని పేర్కొన్నారు.వినాయక చవితి రోజున నజీర్‌ అనే వ్యక్తి ఆ బీఆర్‌ఎస్‌ నాయకుడు వంద మందితో దాడి చేసి ఆ ఇంటి కాంపౌండ్‌ గోడను కాంపౌండ్‌ పరిధిలో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి అడ్డుకొనుటకు ప్రయత్నించిన మల్లయ్య భార్యపై దాడికి తెగబడ్డారని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫోన్‌ చేయగా వారు వచ్చి సమస్యను పరిష్కరించుకోండని సలహా ఇచ్చి వెళ్ళిపోయారన్నారు. అయినా ఆ నాయకుడు తన విధ్వంసం ఆపకుండా విధ్వంసం సష్టించాడని పోలీస్‌ లకు దరఖాస్తు చేసుకున్న ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం విచారకరమన్నారు.ఈ సమావేశంలో జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమేష్‌,శంకర్‌, జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి శ్రీనివాస్‌, లీగల్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌ కుంచం చంద్రకాంత్‌, కో కన్వీనర్‌ వీరేష్‌ నాయక్‌, పట్టణ అధ్యక్షులు బందర్‌నాయక్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ బచ్చలకూరి గోపి, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినరుగౌడ్‌, ఉపాధ్యక్షులు ఈశ్వర్‌సింగ్‌ పాల్గొన్నారు.