భూ ఉద్యమాల కేసులు ఎత్తి వేయాలి

భూ ఉద్యమాల కేసులు ఎత్తి వేయాలి– సీఎం రేవంత్‌కు తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక వినతి
– సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భూ ఉద్యమాల సందర్భంగా పేదలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగుభూముల సాధన కోసం జరిగిన ఉద్యమాల సందర్భంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరారు. జగిత్యాల,మహబూబాబాద్‌, జనగామ, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, సిద్దిపేట, కోదాడ, నిర్మల్‌, కొత్తగూడెం, హన్మకొండ జిల్లా హాసన్‌పర్తి తదితర ప్రాంతాల్లో సుమారు రెండు వేల మందిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. వాటిని తక్షణమే ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇందిరిమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి వాటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని నర్సిరెడ్డి, టి సాగర్‌, ఆర్‌ వెంకట్రాములు సీఎంను కోరారు. ఈ మేరకు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇంటి స్థలం లేని పేదోళ్లకు జాగా ఇచ్చి రూ5లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఇండ్లు, ఇంటి స్థలం లేని పేదలు మూడేండ్లుగా 21 జిల్లాల్లోని 69 కేంద్రాల్లో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగి స్తున్నారని తెలిపారు. సుమారు 60 వేల గుడిసెలను పోలీసులు తొలగించారనీ, ఇంకా ఈ దాడి కొనసాగు తున్నదని వివరించారు. వారందరికీ న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం అసైన్డ్‌ భూములను పేదల నుండి తీసుకుని పార్కులు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్‌ యార్డులు తదితర అవసరాలకు వాడుకున్నదని వివరించారు. భూమికి భూమి ఇవ్వలేదని తెలిపారు. దీంతో పేదలకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు.