ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం

Lands will not be given even if lives are lost– భూసేకరణను అడ్డుకున్న రైతులు
– భారీ పోలీసుల మోహరింపు… రైతుల అక్రమ అరెస్టు
– రోజంతా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధం
– బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి : సీపీఐ(ఎం) జిల్లా
– కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
నవతెలంగాణ-కొండాపూర్‌/సదాశివపేట
తమ ప్రాణాలు పోయినా తమ భూములు ఇవ్వమని ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు వచ్చిన అధికారులకు రైతులు ఖరాఖండిగా చెప్పేశారు. కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌ గ్రామంలో, సదాశివపేట మండలం పెద్దపూర్‌ గ్రామంలో భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు గురువారం సర్వే చేయడానికి వస్తే సీపీఐ(ఎం) నాయకులు గ్రామ రైతులతో కలిసి అడ్డుకున్నారు. నష్టపరిహారం ఎంత ఇస్తారు అని అధికారులు చెప్పకుండా ఏ విధంగా సర్వేలు చేస్తారని రైతుల తో కలిసి ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించిన పోలీసులు సీపీఐ(ఎం) నాయకులు, రైతులను అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా, కొద్దిసేపు తోపులాట జరిగింది. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ, రైతులకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజుతో పాటు రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇంద్రకరణ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మాట్లాడుతూ బలవంత భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నష్టపరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పకుండా అధికారులు ఇష్టానుసారం గా సర్వేలు చేయడం సరైనది కాదన్నారు. అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. రెండు పంటలు వండే భూములను బలవంతంగా గుంజుకుంటూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇష్టం లేకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ రేటుకు మూడింతలు అదనంగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. భూమికి భూమి ఇవ్వాలని భూములు కోల్పోతున్న ప్రతి రైతు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. రైతుల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చినా, అధికారులు ఎలాంటి ఎలాంటి సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా సర్వే చేయడం సరైనది కాదన్నారు. తక్షణమే కలెక్టర్‌ చొరవ తీసుకొని నష్టపరిహారం ఎంత చెల్లిస్తున్నారో చెప్పాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే రాజయ్య, రైతులు,రమేష్‌ పట్లోళ్ల, నాగేశ్వర్‌, అశోక్‌, సంగమేశ్వర్‌, కష్ణుడు, మహేష్‌, బుషన్‌, రాము, నాగరాజు, బానుప్రకాష్‌, మనీష్‌, రాములు, హరిజన్‌, పండరి తదితరులు పాల్గొన్నారు.