భావ వ్యక్తీకరణకు భాష ఎంతో అవసరం. మన దేశంలో పలు ప్రాంతాల్లో పలు భాషలు మాట్లాడుతుంటారు. అయినప్పటికీ మాతభాషలో వ్యక్తం చేసినంత స్పష్టంగా ఇతర భాషల్లో దేన్నీ వ్యక్తం చేయలేం. చాలాకాలం నుంచి అందరికీ తెలిసింది, నేర్చుకోవలసి వచ్చింది ఆంగ్లం. మాతభాష కాకుండా రెండు ఇతరభాషలు నేర్వడమూ ఎంతో మంచిది, అవసరం కూడా. ఆ పరంగా చూసినా ఆంగ్లం, హిందీ ఎంతో ఉపకరిస్తాయి. సరే ఇపుడు అంతా ఇంగ్లీష్ మీడియం ప్రభావంలో వున్నాం కాబట్టి అది తప్పడం లేదు.
తెలుగు భాష మాట్లాడటం, రాయడం అనేది బాల్యం నుంచే తల్లిదండ్రులు, ఆ తర్వాత పాఠశాలలో టీచర్లు నేర్పుతారు. మన పరిసరాల ప్రభావంతో మరింత త్వరగా, మరింత బాగానూ నేర్చుకోగలం. అయితే ఇతర భాషలు అలాకాదు. ప్రత్యేకించి శ్రద్ధచూపాలి. ఈరోజుల్లో స్కూళ్లల్లో ఆంగ్లం తప్పనిసరి కావడంతోపాటు స్కూలు ఆవరణలో ఉన్నంతసేపూ ఆంగ్లంలోనే మాట్లాడాలన్న నిబంధనను దాదాపు అన్ని స్కూళ్లు పాటిస్తున్నాయి. దీనివల్ల కొంతవరకూ ఆ భాష పట్ల పిల్లలకు కొంత ఆసక్తి పెరుగుతోంది.
భాష రావడం అంటే చక్కగా మాట్లాడటంలోనూ, రాయడంలోనూ కొంత నైపుణ్యాన్ని పొందడం అని అర్ధం. ఆంగ్లం లేదా హిందీనే తీసుకుందాం. ఇవి మనం నిత్యం ఇంట్లో ఉపయోగించనివి. కేవలం స్కూళ్లలో, కార్యాలయాల్లోనే ఉపయోగిస్తున్నాం. కానీ వాటిమీద పట్టు రావాలంటే వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
మన భాషను నేర్చుకునేటపుడు కూడా తొలిదశలో తప్పులు మాట్లాడటం, రాయడంలో పొరపాట్లు అందరం చేస్తాం. వాటిని తల్లిదండ్రులు, టీచర్లు పట్టించుకుని సక్రమంగా మాట్లాడటం, రాయడం నేర్పారు. అదే విధంగా ఇతర భాషలనూ నేర్చుకోవాలి. తొలిదశలో ఇబ్బందులు ఉంటాయి. ఇతరులు ఏమన్నా హేళనచేస్తారన్న భయం వుండకూడదు. దాన్నుంచి అధిగమించాలంటే ఒకరిద్దరు స్నేహితులతో మాట్లాడటం ఆరంభించండి. తర్వాత మరో ఇద్దరు ముగ్గుర్ని పరిచయం చేసుకోండి. అదీ మీలాంటి వారినే. రోజూ మాట్లాడుకోవడంతో ఒకరికొకరు సాయం చేసుకోవడంలో కొంత పరిణితి చెందుతారు. క్రమంగా భాష పట్ల భయం తొలగిపోతుంది.
అలా రాయడం కూడా. ఏమైనప్పటికీ తరగతిలో టీచర్లు చెప్పిన గ్రామరు భాగం బాగా ఉపయోగించుకోవాలి. అందుకే గ్రామర్ క్లాసులు డుమ్మా కొట్టవద్దు. అలాగే రాయడం కూడా. తప్పులతో ఆరంభించినా తర్వాత మెళకువలు తెలుసుకోగలుగుతారు. అందరూ బాగా మాట్లాడలేరు, రాయలేరు. స్కూలు స్థాయిలో వున్నప్పుడు కొంతమేరకే ఆ పరిజ్ఞానం కలుగుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే టీచర్లు, తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం తప్పనిసరి. ఇంకా ఇలా చేయండి..
– మరో భాష నేర్వాలన్న పట్టుదలతో వుండండి.
– టీచర్లు, తల్లిదండ్రుల సహాయం పొందండి.
– ముందుగా స్నేహితులతో మాట్లాడటం ఆరంభించండి.
– హేళన చేయవద్దు, చేసినా పట్టించుకోవద్దు. భాష నేర్వడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.
– చుట్టూ వున్న వారితో పరిచయాలు పెంచుకోండి.
– ఆ భాషలో మీకు అర్ధమయ్యే పుస్తకాలు చదువుతూ వుండండి. వార్తా పత్రికలు చదువుతూ వుండండి.
మిమ్మల్ని మీరు ధీటుగా తయారుచేసుకోవడంలో మాతభాషతో పాటు మరో భాష అవసరాన్ని మీరే తెలుసుకుంటారు. ఇది మున్ముందు జీవితంలో ఎంతో ఉపకరిస్తుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్