– 15 శాతం ఓపెన్ కోటాకు ఏపీ విద్యార్థులు అర్హులే
– 2015-26 విద్యాసంవత్సరం నుంచి సీట్లన్నీ తెలంగాణ వారికే: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 15 శాతం ఓపెన్ కోటాకు ఏపీ విద్యార్థులూ అర్హులేనని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం చేసింది. అంటే 2025-26 విద్యాసంవత్సరం నుంచి తెలంగాణలోని సీట్లన్నీ ఇక్కడి స్థానిక విద్యార్థులకే దక్కుతాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం తెలంగాణ, ఏపీ విద్యార్థులకు సమాన విద్యావకాశాలను కల్పించాలి. అడ్మిషన్ల కోటాను పదేండ్లకు మించకుండా కొనసాగించాలని అందులో పేర్కొంది. దీంతో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం ఓపెన్ కోటాలో ఏపీతోపాటు తెలంగాణ విద్యార్థులకూ సీట్లు లభిస్తాయి. అయితే ఈ ఏడాది జూన్ రెండుతో తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు పూర్తవుతుంది. అయితే ఇంజినీరింగ్, సహా ఫార్మసీ వంటి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌తోపాటు వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రాతపరీక్షల షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. మేలో రాతపరీక్షలు జరుగుతాయి. ఈ ప్రక్రియ అంతా జూన్ రెండులోపు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే 15 శాతం ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకూ అవకాశం కల్పించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్తున్నారు. ఇక ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. రెండు, మూడు రోజుల్లో ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశమున్నది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అంశంపై దృష్టిసారించారు.