‘డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ క్యాంపెయిన్‌ 3.0’ ప్రారంభం

– 70 లక్షల మంది కేంద్ర పింఛనుదారులకు ప్రయోజనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో పింఛన్‌దారుల కోసం ‘డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ క్యాంపెయిన్‌ 3.0’ని ప్రారంభించినట్టు జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. ఏటా పెన్షనర్లు పెన్షన్‌ కొనసాగింపు కోసం నవంబర్‌ నెలలో లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించవలసి ఉంటుందనీ, వాటిని డిజిటల్‌గా సమర్పించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామన్నారు. దీనివల్ల 70 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు తీసుకుంటే పెన్షన్‌దారులు భౌతిక ధృవీకరణ కోసం కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదన్నారు. సమయం ఆదా అవుతుందనీ, ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ ప్రమాణీకరణ ప్రక్రియకు భద్రతా అంశాన్ని జోడించి, మోసపూరిత క్లెయిమ్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఫేస్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీ ద్వారా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఆధార్‌ ఆధారంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చని వివరించారు. పెన్షన్‌దారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్‌ ఫేస్‌ ఆర్‌.డి యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని, నిబంధనల ప్రకారం తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను నేరుగా సంబంధింత కార్యాలయానికి పంపొచ్చని తెలిపారు.