ప్రకృతి శాసనం

ఎవడి రహస్య ఎజెండాలు
వాడికి ఉన్నాయి.

ఎన్నికల ఓట్ల కళ్ళద్దాలు తప్ప
వాడికేం కన్పించదు.

మనిషిగా జీవించడం
ఎప్పుడో మానేసాడు

ఈక్షణం నాబతుక్కి
రక్షణ కావాలి
దిక్కులు పిక్కటిల్లే
ఆక్రందన నాది
నరకప్రాయమైన
గుండెలోతుల్లో నుండి
వస్తున్న ఆత్మఘోష ఇది.

పేరుకే ప్రజాస్వామ్యం!
నాపై మూకాసురల రాజ్య దండయాత్ర

ఈ అసురుల ప్రాణ ప్రతిష్ట ఎవరిది?
నీది కాదా..?

నన్ను చంపినోళ్ళనో
నన్ను చెరచినోళ్ళనో
చంపేస్తే సరా? అదే
సమస్యాంతమా?

యుగయుగాలుగా
ఇవేగా ఘోరాలు – నేరాలు
మారణ హౌమాలు – యుద్ధాలు
ఊచకోతలు – ప్రతీకారాలు

అసలు మనిషిపై
అంత కక్షెందుకు నీకు

నాలాగా నీవు
తల్లికడుపున పుట్టలేదా?
మరినీలాగానాకు
బతికే హక్కులేదా ఇదేం ధర్మం?
… … …
రక్షణ రక్షణ రక్షణ
రక్షణ స్థాపించే
శాంతిని శోధించండి
సాధించండి, బోధించండి

మనిషి రక్షణ పట్టని
మనిషెందుకు? పాలనెందుకు?

మళ్ళీ మళ్ళీ చెప్తున్నా…
నా రక్షణకై నేనే
నా మనుషులతో కలసి
జన్మ జన్మలు పోరాడుతా
ఇదే మానవ ధర్మం
ప్రకృతి శాసనం.

– కె శాంతారావు
9959745723