– రుణవిమోచన చట్టంతో రైతులను ఆదుకోవాలి
– దేశానికి తిండిపెట్టే రైతును పట్టించుకోని కేంద్రం
– రైతులను దోచి కార్పొరేట్లకు పెట్టే దిశగా చట్టాల రూపకల్పన
– రైతు ప్రయోజన చట్టాల కోసం నడుం బిగించాలి
– రాష్ట్రంలో వరి తప్ప మిగతా పంటల సాగుకు ప్రణాళికల్లేవ్.. : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
‘రైతు పండించే ప్రతి పంటకూ మద్దతు ధర, గ్యారంటీ మార్కెట్ కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. కేరళ తరహా రైతు రుణవిమోచన, మద్దతు ధర కల్పించే చట్టాలను చేయాలి. పరిశ్రమల్లో ఉత్పత్తులకు ధర నిర్ణయించినట్టుగానే రైతు పండించే పంటలకూ రేటు నిర్ణయించే చట్టాన్ని తేవాలే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే కుట్ర చేస్తోందని, దాన్ని తిప్పుకొడుతూ ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతాంగ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర రైతాంగం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి’ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు.
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుంద లాల్ మిశ్రాభవన్‌లో మూడ్రోజులు జరగనున్న రాష్ట్రస్థాయి శిక్షణాతరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా సంఘం జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణవెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో టి.సాగర్ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో నీళ్లు, సరిపడా విద్యుత్ సౌకర్యంతో పెద్దఎత్తున వరి పండుతున్నా.. రైతాంగం నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేదన్నారు. కేంద్రం వరికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2060 ప్రకటించిందే తప్ప చట్టం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తున్నప్పటికీ అది ఆలస్యమవుతుండటంతో ప్రయివేటు వ్యాపారులు, మిల్లర్లు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని క్వింటా ధాన్యానికి రూ.1600 నుంచి రూ.1700 కూడా చెల్లించకుండా కొంటున్నారని తెలిపారు. పైగా వరి తప్ప మిగతా పంటల సాగుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు లేవని, అందుకు కనీస ఆలోచనా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతూ పెద్ద ఎత్తున వరి పండిస్తున్నా.. సరైన ధర గిట్టుబాటుకాక నష్టాల పాలవుతున్నారని వివరించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన పెట్టుబడి, పంటల కొనుగోలును పకడ్బందీగా నిర్వహించే వీలున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. పైగా వందశాతం రుణాలను గ్రామీణ ప్రాంత రైతులకే ఇచ్చే సహకార సంఘాలను నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు మల్టీ స్టేట్ కోఆపరేటీవ్ సిస్టమ్ తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ పంటల్లేవ్.. ప్రభుత్వ సహకారమూ లేదు
రాష్ట్రంలో 50శాతానికిపైగా కాయగూరలు, పండ్లు ఇతర పంటలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని సాగర్ తెలిపారు. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఇక్కడి జనాలు అధిక ధరలకు వాటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా పప్పులు, నూనెగింజల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహించడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పత్తికి బదులు కందులు, పెసర్లు పండించాలని, ప్రభుత్వమే 10వేల క్వింటాళ్లు కొంటుందని నమ్మబలికి తీరా పెద్దఎత్తున పంట చేతికొచ్చాక కనీసం 6వేల క్వింటాళ్లు కూడా కొనలేదని గుర్తు చేశారు. కనీసం కేరళను చూసైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని సూచించారు. కేరళలో రైతు రుణ విమోచన చట్టం తీసుకొచ్చి రైతులను రుణవిముక్తులను చేశారని, కొత్త రుణాలు ఇస్తూ సాగు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు. అక్కడి ప్రభుత్వం 16రకాల కాయగూరలకు మద్దతు ధర ప్రకటించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తూ క్వింటాల్ వరి ధాన్యంపై రూ.800బోనస్ కూడా ఇస్తోందని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం మాత్రం రైతులు, వ్యసాయ కూలీలు, కౌలు రైతులు, చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.