– 21 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన
– 23,24 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదు
– 25న తొలివిడత సీట్ల కేటాయింపు
– డిసెంబర్ 4 నుంచి తరగతులు ప్రారంభం
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ఈనెల 14 నుంచి లాసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గురువారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన లాసెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్లు ఎస్‌కే మహమూద్, వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, లాసెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రమేష్‌బాబు లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 14 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు ధ్రువపత్రాల పరిశీలన కోసం ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలనకు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ ఉంటుందని వివరించారు. 16 నుంచి 19 వరకు ప్రత్యేక కేటగిరీ (సీఏపీ, ఎన్‌సీసీ) అభ్యర్థులకు హైదరాబాద్‌లో భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. 22న అర్హులైన అభ్యర్థుల వివరాలను పొందుపరుస్తామనీ, ఏమైనా సవరణలుంటే ఈమెయిల్ ద్వారా స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో అభ్యర్థులు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వివరించారు. 25న తొలివిడత సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 29 నుంచి డిసెంబర్ రెండు వరకు కేటాయించిన కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో చేరాలని కోరారు. ట్యూషన్ ఫీజును చలానా ద్వారా చెల్లించాలని సూచించారు. వచ్చేనెల నాలుగు నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఇతర వివరాల కోసం షషష.శ్రీaషషవ్aసఎ.్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. లాసెట్-2023లో 29,049 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 26 లా కాలేజీల్లో ఎనిమిది వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడేండ్ల లా కోర్సులో 20,234 మంది ఉత్తీర్ణులైతే, 22 కాలేజీల్లో 4,790 సీట్లు, ఐదేండ్ల లా కోర్సులో 6,039 మంది అర్హత సాధించగా, 19 కాలేజీల్లో 2,280 సీట్లు, పీజీలాసెట్‌లో 2,776 మంది ఉత్తీర్ణులుకాగా, 17 కాలేజీల్లో 930 సీట్లున్నాయి.