చరిత్ర గతిని మార్చేది న్యాయవాదులేనని ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆసనాల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంక్రీజింగ్ డైవర్సిటీ బై ఇంక్రీజింగ్ ఆక్సెస్ సంస్థ మరియు జాతీయ న్యాయ శాస్త్ర విశ్వ విద్యాలయం (నల్సార్ )హైదరాబాద్ ఆధ్వర్యంలో న్యాయ శాస్త్రము ఉన్నత విద్య ఉపాధి అవకాశాల పై అవగాహన సదస్సు ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్ సెమినార్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ విముక్తి కోసం పోరాడి చరిత్ర గతిని మార్చిన మహనీయులందరు వృత్తి రీత్యా న్యాయవాదులని అన్నారు.వివక్షతలు, దోపిడీ లేని ఆధిపత్య పోకడలు లేని న్యాయవంతమైన సమాజ నిర్మాణంలో న్యాయశాస్త్ర విద్య కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
దేశంలో మొదటి స్థానంలో ఉన్న నల్సార్ న్యాయ శాస్త్ర విద్యార్థులు కీర్తి సాత్విక ,జోషితలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ఇంటర్ విద్యార్థులను కెరీర్ కోసం
న్యాయశాస్త్ర విద్యపై ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.నల్సార్ లాంటి జాతీయ యూనివర్సిటీలలో ప్రవేశం కోసం క్లాట్ ప్రవేశ పరీక్ష ఉంటుందని దీనిలో కరెంట్ అఫైర్స్ ,లీగల్ ఆప్టిట్యూడ్ ,జనరల్ ఇంగ్లీష్ లు ఉంటాయని తెలిపారు.ప్రభుత్వ న్యాయ శాఖా ఉద్యోగాలతో పాటు అన్ని ప్రవేట్ కార్పొరేట్ కంపెనీలు ,భీమా రంగాలలో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.ప్రస్తుతం విస్తృత ఉపాధి అవకాశాలు ,మంచి వేతనం ఉన్న రంగంగా న్యాయ శాస్త్రం ఉందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులకు తమ సంస్థ ద్వారా ఇంటర్ తో పాటే క్లాట్ పరీక్షకు ఉచిత శిక్షణ ,స్కాలర్ షిప్ అందిస్తామని తెలిపారు. బలమైన సంకల్పం, సృజన శీలత గల గ్రామీణ విద్యార్థులకు లా కోర్స్ అణువుగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు.
అవగాహన కల్పించిన కీర్తి సాత్విక, జోషిత లను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో యన్ యస్ యస్ అధికారి జ్యోతి, కస్తూర్భా హెడ్మాస్టర్ మాధవి, అధ్యాపకులు కనకయ్య, కరుణాకర్, బాబురావు, రాములు, వెంకట్, ప్రభాకర్, మంజుల, గణేష్, అజమ్, గోపాలకృష్ణ లతో వివిధ కళాశాలల పాఠశాలల నుండి 250మంది విద్యార్థులు పాల్గొన్నారు.