హైకోర్టును బుద్వేల్‌కు తరలించొద్దు: న్యాయవాదులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైకోర్టును రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి వెనక్కి తీసుకోవాలని పలువురు హైకోర్టు న్యాయవాదులు కోరారు. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘హైకోర్టు నగరం నడిబొడ్డున ఉండాలి. ఫ్యామిలీ కోర్ట్స్‌, సివిల్‌ కోర్ట్‌, హైకోర్టుకు కేసుల నిమిత్తం నడుస్తూ కూడా న్యాయవాదులు ఆ కోర్టులకు సకాలంలో చేరుకుని తమ క్లయింట్స్‌కు న్యాయం చేయవచ్చు. అలాగే నాంపల్లి క్రిమినల్‌ కోర్ట్‌ చంచల్‌ గూడా జైలు కూడా చేరువలో ఉంది. ఇలా ఉంటే వాహనాలు లేని సామాన్య అడ్వకేట్స్‌కు తమ న్యాయవాద వృత్తికి ఇబ్బంది ఉండదు. అదే హైకోర్టు రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌కు తరలిస్తే ఐదు శాతమున్న కార్పొరేట్‌ ఆఫీస్‌లకు లాభమే తప్ప 95 శాతమున్న సామాన్య న్యాయవాదులకు ఇబ్బంది …’అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుండ్రాతి శారదాగౌడ్‌, బర్ల మల్లేష్‌ యాదవ్‌, రామారావు. మామిడి వేణు మాధవ్‌, మల్లారెడ్డి, మణికంఠ, ప్రసాద్‌, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.