– కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై దిగ్భ్రాంతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో విజయ సంకల్ప యాత్రతో పెనుమార్పులు రాబోతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో రాణిస్తూ ఎదిగే క్రమంలో ఆమె అకాల మరణం కలిచివేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందనీ, ఇప్పటికే ఆరు క్లస్టర్ల పరిధిలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి చిట్టాను, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న హామీల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నా యని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆరుగ్యారెంటీల అమలు సాధ్యమవుతుందని చెప్పటం దివాళాకోరు తనమే అవుతుందని విమర్శించారు. తలాతోక లేని కుటుంబ, ప్రాంతీయ పార్టీలు, అవినీతిలో కూరుకు పోయిన పార్టీలు బెయిల్‌పై బయటకొచ్చి తిరుగుతున్న నేతల పార్టీలు ఒక్కటై కూటమి గడితే ఎలా విజయవంతం అవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, ఇసుక దోపిడి చేసిన బీఆర్‌ఎస్ నాయకుల అవినీతిని కక్కిస్తా మని చెప్పి ఇప్పుడు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్‌లోని సీతారామపూర్‌లోని 1,110 ఎకరాలను దేవాదాయ భూమిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు అప్పనంగా అప్పజెప్పిందని ఆరోపించారు. ఆ ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఊసెత్తడం లేదని ప్రశ్నించారు. దేవాదాయ భూముల రక్షణ కోసం పోరాటాలు చేస్తామని ప్రకటించారు.