ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్‌దే నైతిక బాధ్యత : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఎస్సారెస్పీలో నీటి కొరతకు కేసీఆర్‌దే నైతిక బాధ్యత : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎస్సారెస్పీలో నీటి కొరత రావడానికి మాజీ సీఎం కేసీఆర్‌దే నైతిక బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. వర్షాకాలంలో మేడిగడ్డ నీటిని ఎస్సారెస్పీకి తరలించలేదని ఆరోపించారు. ఈశాన్య రుతుపవనాలు మొండికేయడంతో ఆశించిన స్థాయిలో వర్షం కురవలేదనీ, మేడిగడ్డ నీటిని ఎందుకు విడుదలచేయలేదని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జీవన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ ప్లాంట్‌పై జ్యూడిషియల్‌ విచారణకు ఆదేశించడంతో కేసీఆర్‌కు గుబులు మొదలైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ తుడిచి పెట్టుకపోవడం ఖాయమని తెలిపారు. ఆ పార్టీ ప్రజా ప్రయోజనాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో (2014) బీజేపీ ఏం చెప్పిందో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఎలక్ట్రోరల్‌ బాండ్లను బయట పెట్టేందుకు బీజేపీ సర్కారు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. దేశంలో మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండబోవని ఆందోళన వ్యక్తం చేశారు.