లే.. లేలే ఇండియా

లే.. ఇండియా.. లేలే ఇండియా
దేశపు మానాన్ని ఉన్మాదపు వీధుల్లో ఊరేశాక
అమ్మతనాన్ని ఉన్మాదపు హేళనల్లో తగలేశాక
కళ్ళుండీ చూడని కబోది పాలన సాగుతున్నాక
ఇంకా మౌనమా? లేక ఇది చేతగానితనమా?

తలల్లో తుట్టెలు కట్టిన ఉన్మాదం ఊరేగుతున్నాక
అమ్మలను నగంగా కొమ్మలకు వేలాడదీసి
దేశాన్ని ‘పరువు హత్య’చేసి నడి వీధిలో పాతాక
పాలనుందనీ, పాలకులున్నారనీ నమ్ముతున్నావా?
ఆర్నెల్లుగా మండుతున్న మణిపూర్‌ ఉన్మాదాన్ని
ఆర్పని పాలనను ప్రజా పాలనే అంటావా?
ఉన్మాదంలో కరిగి పోయిన నికష్టం అంటావా ?
ఇంకా మౌనమా? లేక ఇది చేతగాని తనమా?

లే.. ఇండియా లేలే.. ఇండియా
చెవుల్లో సీసం పోసుకున్న ఈ పాలకుల కపటత్వాన్ని
పార్లమెంట్‌ మైకుల్లో చాటినంతనే ఆగని ఉన్మాదాన్నీ
చితుల్లో తగలేసి .. జాతీయ గీతం గానం చేస్తూ
అమ్మ భారతి ‘పరువు రక్షణ’ పోరాటానికీ
భరత జాతి వారసత్యమే మనదని చాటడానికీ
ప్రజాక్షేత్రంలో నిలబడి తలపడి సమాధానం అడగడానికీ
నిలేసి కడగడానికీ.. దులపడానికీ.. ఇదే సమయం
ఇంకా మౌనంగా ఉందామా? తలెత్తుకు నిలుద్దామా?

లే .. ఇండియా లేలే .. ఇండియా
– ఉన్నం వెంకటేశ్వర్లు,
సెల్‌:8790068814