లీచ్‌ థెరపీ..!

Leech therapy..!రక్తాన్ని పీల్చేవాళ్ళని జలగలతో పోలుస్తాం. ఒకడు ఇబ్బంది పెడుతూ మనల్ని పట్టిపీడిస్తుంటే జలగలా పట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు. రక్తాన్ని పీల్చే జలగలను చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇక వాటిని శరీరంపై పాకిస్తే.. తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా! విచిత్రం ఏంటంటే- అదే జలగని రోగాన్ని పీల్చిపిప్పి చేసేందుకు వాడుతున్నాం.
”మైక్రో వ్యాస్కులర్‌ సర్జరీ” తరహా సూక్ష్మ స్థాయి ఆపరేషన్లలో ప్రతి రక్తనాళాన్ని, కణజాలాన్ని కలపడం వంటి అవసరాలు ఏర్పడడంతో మన ప్రాచీన వైద్య చికిత్స తిరిగి వెలుగులోనికి వచ్చింది.
సా.శ.పూ 800 ప్రాంతంలో సుశ్రుతుడు ఉపయోగించిన ఈ వైద్య విధానం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత గౌరవాన్ని అందుకుంటోంది.
విదేశీ వైద్య నిపుణులు జలగలను ”ప్రాణంతో ఉన్న ఔషధాలు” (లివింగ్‌ డ్రగ్‌) గా పిలుస్తారు. అనేక దీర్ఘ వ్యాధులకు, ”పిత్త దోషం” తో బయల్దేరిన పలు వ్యాధులకు ”రక్తాన్ని పీల్చే జలగతో చికిత్స” ఉందని సుశ్రుతుని వైద్య గ్రంథాలు తెలిపాయి. శరీరానికి గాయం చేయడమే కాకుండా, ఆ గాయం నుంచి గంటల తరబడి రక్తం స్రవించే విధంగా చేయగలిగే ప్రత్యేక గుణం కలిగి ఉండటం వల్లనే జలగలకు ఇంతటి ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.
ఆయుర్వేద ప్రాచీన సంస్కత గ్రంథమైన సుశ్రుత సంహితలో ‘జలకవచరణ’ అని పిలువబడే అతి తక్కువ హానికర సాంకేతికతగా కూడా జలగ చికిత్స పేర్కొనబడింది
జలగతో వైద్యాన్ని హిరుడో తెరఫీ అంటారు. జలగ సాంకేతిక నామం హిరుడోస్‌. జలగను ఆంగ్లంలో గ్రాంధిక పదం లెస్‌, లెస్‌ నుండే ఆంగ్లంలో లీచ్‌ అనే పదం వచ్చిందని నిపుణులు అంటున్నారు. మలినాలు పెరిగినప్పుడు అనారోగ్యం సంభవిస్తుంది. ఎవరికైనా తీవ్ర అనారోగ్యం వచ్చిందో – రోగి రక్తం దాని జలగల నోటిద్వారా పీల్చేటట్టు చేసేవారని ప్రాచీన వైద్యంలో జలగ చికిత్స గురించి పందొమ్మిదో శతాబ్దంలో వివరించిన అనంతరం ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్తారు. లీచ్‌ థెరపీ చేసే వాళ్ళలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
హిరుడో మెడిసినలిస్‌ మూడు దవడలను కలిగి ఉంటుంది, ఒక్కో బయటి అంచుపై దాదాపు 100 పదునైన దంతాలు ఉంటాయి. జలగ దాని సక్కర్‌ను జంతు శరీరాన్ని కరిచి పట్టుకుని సక్కర్‌ మధ్యలో ఉన్న నోరు, దంతాలను బహిర్గతం చేయడానికి తెరుస్తుంది. ఇది రోగి చర్మంలోకి నొప్పి లేకుండా చేస్తుంది. కాటు జరిగిన ప్రదేశానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి రక్త నాళాలను విస్తరింపజేస్తుంది. రక్తం పోతున్నా ఆ వ్యక్తికి నొప్పి తెలియదు. ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతాలో వైద్యం చేయడానికి జలగను వాడే వారు అని అంటున్నారు.
జలగ నుంచి వెలువడే ఒక రకమైన ద్రవ పదార్థం మన శరీరంపై ఉండే గాయాల చూట్టూ మత్తులా పనిచేసి రక్తం గడ్డకట్టకుండా రక్త నాళాల రంధ్రాలను పెద్దవిగా చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. తద్వారా పలు వ్యాధులను తగ్గించవచ్చు.
జలగలను ప్రాణంతో ఉన్న ఔషధాలు – లివింగ్‌డ్రగ్‌గా పిలుస్తారు.
అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి ఇవి ఎంతో ఉపయోగ పడుతున్నాయి. వ్యాధి సోకిన ప్రాంతాన్ని ముందుగా జాగ్రత్తగా శుభ్రం చేసి పొడిగా తుడవాలి. చిన్నగా కోతపెట్టి ఆ గాటు మీద జలగలు ఉంచడంతో రక్తాన్ని తినడం ప్రారంభిస్తాయి. టాక్సిన్స్‌ తొలగించబడిందని నిర్ణయించినప్పుడు మాత్రమే ప్రక్రియ నిలిపివేయ బడుతుంది. చికిత్స పూర్తి అయ్యాక కొద్దిగా ఉప్పు/ తేనెను/ పొగాకు నమిలిన రసం పూయడం ద్వారా శరీర భాగం నుంచీ జలగలు తొలగించబడతాయి (కుండలో ఘాటు సున్నం కఱ్ఱపుల్లలతో గోకి ఆ జలగల మీద బెడితే ఆ ఘాటుకి జలగలు జీవుల చర్మాన్ని వదిలి వేస్తాయి)
బెర్లిన్‌లోని ఇమ్మాన్యుయేల్‌ ఆస్పత్రికి చెందిన వైద్యులు ‘ఆండ్రియాస్‌ మైఖాన్‌’ ఆధ్వర్యంలో నిపుణులు జలగలపై పరిశోధనలు చేశారు. మెడికల్‌ జర్నల్‌లోనూ ఆ పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. తీవ్రంగా వెన్నునొప్పితో బాధపడుతున్న మొత్తం 44 మందిని ఎంపిక చేసి, వారి వీపు భాగంలో ఏడు జలగలను వదిలి పెట్టారు. వారందరికీ కాసేపటిలో నొప్పి తగ్గింది. వారానికి నాలుగుసార్లు ఈ తరహా జలగ వైద్యం చేశారు. దీంతో 70శాతం నొప్పి మాత్రలు మింగే అవసరం లేకుండా పోయింది. వెన్నులో ఉన్న చెడు రక్తాన్ని జలగలు పీల్చి వేయటం వల్లే వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం లభించిందని ఆ పరిశోధకులు పేర్కొన్నారు.
మధుమేహం వల్ల వచ్చే ప్రధాన సమస్య పుండ్లు. షుగర్‌ ఎక్కువగా ఉన్న వారికి శరీరంలోని కొన్ని భాగాలతో పాటు కాళ్లు, చేతుల్లో చెడు రక్తం పేరుకుపోయి రంగు మారుతుంది. ఆ ప్రాంతంలో దురద మొదలై ఆ తర్వాత పుండుగా మారుతుంది. షుగర్‌ వల్ల కలిగే వాస్కులర్‌ అనారోగ్యాలు కాలివేళ్లు, చేతులు, పాదాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. లేదా ఆపేస్తాయి. దీని వల్ల కణజాలాలు రక్త సరఫరా లేకపోవడం వల్ల చనిపోతాయి. డయాబెటిస్‌లో కలిగే గాయాలు, దెబ్బల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. వీటి వల్ల కలిగే బాధ చెప్పలేనిది. ఇలాంటి వారికి ఒక్కోసారి సర్జరీలు కూడా అవసరమవుతాయి. ఈ సమస్యను లీచ్‌ థెరపీతో చెక్‌ పెట్టొచ్చు అని చెప్తున్నారు వైద్య నిపుణులు.
రక్తం గడ్డకట్టే ప్రమాదం లేకుండా దెబ్బతిన్న కణజాలాలకు రక్త ప్రసరణ పెంచడానికి జలగల వైద్యం బాగా పనిచేస్తుంది. ఆపరేషన్‌ వీలుకాని వారు, గుండె జబ్బుతో బాధపడుతున్నవారు, కాస్మెటిక్‌ సర్జరీతో మదు కణజాలం కోల్పోయే ప్రమాదం ఉన్నవారు ఈ జలగల వైద్యంతో ప్రయోజనం పొందవచ్చు. లీచ్‌ థెరపీతో రక్త ప్రవాహాన్ని పెంచే సామర్థ్యం ఉన్నందున గుండె జబ్బు ఉన్నవారికి ఉపయోగిస్తారు. వాస్కులర్‌ డిసీస్‌ లీచ్‌ థెరపీ చక్కగా ఉపయోగ పడుతుందని నిపుణులు అంగీకరించారు.
జలగ లాలాజలంలో లభించే ప్లేట్‌లెట్‌ నిరోధకాలు, ప్రత్యేకమైన ఎంజైమ్‌లున్న కారణంగా, క్యాన్సర్‌ చికిత్సలో రక్తసంబంధిత ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారికి లీచ్‌ థెరపీ సిఫారసు చేయబడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలను తగ్గిస్తుందని, క్యాన్సర్‌ కణాలు శరీరంలో వ్యాపించకుండా ఉన్నాయని నిరూపితమయింది.
సాధారణంగా ఏర్పడ్డ పుండ్లలో చెడురక్తం, చీము, నీరు ఏర్పడ్డ బ్యాక్టీరియా మొదలైన వాటిని జలగ తినేస్తుంది. దీంతో తొందరగా పుండ్లు నయమవుతాయి. నిపుణులైన వైద్యుల వద్ద మాత్రమే ఈ చికిత్స చేయించుకోవాలి. ఫైల్స్‌ నివారణకు జలగ చికిత్స ఎంతో ఉపయోగ పడుతుంది. రక్తపు గడ్డలు కరగటానికి, పుండ్లు తగ్గటానికి, నొప్పి నివారణకు లీచ్‌ థెరపీ బాగా పనిచేస్తుంది.
ప్రస్తుతం ప్లాస్టిక్‌ సర్జరీలో బ్రిటన్‌లోని వైద్యులు సైతం జలగను వాడుతున్నట్టు తెలిపారు. చెవి ముక్కు తెగి పోయినప్పుడు మోకాలి చిప్పలు అరిగిపోయినప్పుడు లీచ్‌ థెరపీ వినియోగిస్తున్న విషయం గమనించవచ్చు.
కంటి జబ్బులకు, పంటి జబ్బులకు విదేశాల్లో ఎక్కువగా జలగ వైద్యం ఉపయోగి స్తుంటారు. కంటిలో గ్లకోమా వల్ల చూపు మందగిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం, రక్తం గడ్డకట్టటం వల్ల రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడి కూడా కంటిచూపు తగ్గుతుంది. కంటి చివరి భాగంలో జలగ చికిత్స వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగుపడుతుంది. అలాగే పంటి చిగుళ్లలో చెడు రక్తం చేరి బాగా ఇబ్బంది పెడుతుంది. దీన్ని కూడా జలగ చికిత్సతో నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జలగలు చెడు రక్తాన్ని తాగేస్తూ ఆ ప్రాంతంలో పెప్టైడ్లు, ప్రోటీన్లను స్రవిస్తాయి. దీని వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి. అంతేకాదు ఈ చికిత్స తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా.
యూరప్‌ వంటి దేశాలలో మొటిమలకు జలగ వైద్యాన్ని ఫేషియల్‌ చేయించుకున్నంత తేలిగ్గా చేయించు కుంటారు. ముఖంపై పెద్ద పెద్ద మొటిమలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. చాలామంది అమ్మాయిలు వీటివల్ల మానసికంగా నలిగి పోతుంటారు. జలగ చికిత్సలో ఈ మొటిమల నివారణకు ఎంతో గుర్తింపు ఉంది.
బోధకాలు వ్యాధి వల్ల ఎంతో మంది సతమతమవుతుంటారు. వ్యాధి మొదటిదశలో జలగల చికిత్స చేయించుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వ్యాధి వచ్చిన ఆరు నెలల్లో ఈ చికిత్స చేయించుకుంటే పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాలులో పేరుకుపోయిన చెడు రక్తాన్ని తొలగించి కాలు లావును తగ్గిస్తుంది.
ఔషధ ప్రయోజనాల జలగలను ప్రత్యేకంగా పెంచుతారు. 10 నుంచి 12 సెం.మీ పొడవు కలిగి ఉండే వాటిని చికిత్సకు ముందు పసుపుతో వాటిని జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. సాధారణంగా, బురదతో కూడిన చిన్న చెరువులో పెంచుతారు. రక్తం తీసిన తర్వాత జలగలు పడిపోతాయి. జలగలు విడిపోయినప్పుడు, దాని శరీరానికి బియ్యం పొడితో మర్దన చేయాలి. దాని నోటిని నూనె ఉప్పుతో మసాజ్‌ చేయాలి.
ఒక జలగ దాదాపు 30 నిమిషాల పాటు తన ఆహారంగా మన రక్తాన్ని తీసుకుంటుంది. ఆ సమయంలో అది 15 గ్రాముల (ఔన్స్‌లో అర్ధభాగం) రక్తాన్ని తీసుకుంటుంది. అయితే జలగ చేసిన గాయం నుంచి కనీసం ఆరు గంటల సేపు నెమ్మది స్థాయిలో రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది.
ఈ తరహా వైద్య ప్రక్రియకు వినియోగించే జలగను ఆకలితో అలమటించేలా చేయాలని, అలా చేయడం వల్ల అవి ఎక్కువ వేగంగా రక్తాన్ని పీల్చేందుకు అవకాశం ఉంటుందనీ తెలుస్తున్నది.
బతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బతకాలన్నదే నిజమైన జీవన విధానం. ప్రకతినే ఆధారం చేసుకొని తర్వాతనే వైద్య చికిత్సలకు శ్రీకారం చుట్టిన సుశ్రుతుని వైద్యగ్రంథం వేల ఏండ్లు గడిచి నప్పటికీ ఆధునిక కాలంలో వైద్య చికిత్సలకు స్ఫూర్తిని అందిస్తోంది.
తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి
80085 77834