ఢిల్లీ గడ్డపై వాలిన నేతలు… సీటు కోసం పైరవీలు

Leaders leaning on the soil of Delhi... Piravis for the seat– స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల కోసం కాంగ్రెస్‌ ఆశావహుల క్యూ
– అక్కడే మకాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో సీడబ్య్లూసీ సమావేశాలు, విజయభేరి సభ జయప్రదం కావడంతో కాంగ్రెస్‌లో జోష్‌ మరింత పెరిగింది. ఎన్నికలకు అత్యంత కీలకమైన టికెట్ల ప్రక్రియను ప్రారంభించింది. దీన్ని పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సంసిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో బుధవారం ప్రారంభమైన స్క్రీనింగ్‌ కమిటీ రెండో రోజు కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది నాయకులు ఢిల్లీ గడ్డపై వాలిపోయారు. స్క్రీనింగ్‌ కమిటీ జరుగుతున్న పరిసర ప్రాంతల్లో మకాం వేశారు. వారికి పరిచయం ఉన్న అగ్రనేతలతో పౖౖెరవీలు చేస్తున్నట్టు తెలిసింది. స్క్రీనింగ్‌ కమిటీలోని నాయకులు ఎవరు చెబితే వింటారు? వారితో ఉన్న సంబంధాలేంటి? సీడబ్య్లూసీ సభ్యులు, పార్టీ సీనియర్‌ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, గతంలో రాష్ట్ర కాంగ్రెస్‌ బాధ్యతలు చూసిన ఇంచార్జీలను, చివరికి అగ్రనేతల పీఏలను సైతం రాష్ట్ర నాయకులు వదలడంలేదు. ‘ఏది ఏమైనా సరే ఫలానా నియోజకవర్గం టికెట్‌ నాకే రావాలి. మీరేం చేస్తారో తెలియదు. నా గురించైతే మీకు తెలుసు. దశాబ్దాలుగా నేను పార్టీకి సేవ చేస్తున్నా…ఇన్నాళ్లు పార్టీ నమ్ముకుని ఉన్నా…ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు. ఈసారైనా నాకు ఫేవర్‌ చేయండి. నాకు టికెటు ఇస్తే కచ్చితంగా బయటపడుతా’ అంటూ హస్త్తినలో ఫోన్లు మోగుతున్నాయి. మరికొందరు నేరుగా కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఏ ఇద్దరు కలిసినా తనకు టికెట్‌ దక్కుతుందా? లేదా? అనేదే చర్చ. స్క్రీనింగ్‌ కమిటీలో రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీగౌడ్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. వారి సొంత జిల్లాల నుంచి ఢిల్లీకి వెళ్లి వారిని కలుస్తున్నారు. అంతే కాకుండా ఆ నాయకుల ప్రధాన అనుచరులు, వారినే నమ్ముకున్న నేతలు కూడా హస్తినకు వెళ్లారు. ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఎక్కువ మంది హస్త్తినకు చేరుకున్నారు. దాదాపు 35 నుంచి 40 సీట్లకు ఒకే పేరు పంపించినట్టు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి కొన్ని చోట్ల రెండు పేర్లు, మరికొన్ని చోట్ల మూడుపేర్లు పంపించినట్టు పార్టీ నేతలు అంటున్నారు. ఒక్కటే పేరు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్య లేకపోయినా, రెండు, మూడు పేర్లు ఉన్న చోట ఏ ఒక్కరికి ఇచ్చినా మరొకరి నుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ భావిస్తున్నది. దీంతో జాబితా దఫాదఫాలుగా ప్రకటించకుండా మొత్తం సీట్లను రెండు జాబితాలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పై˜ౖరవీల స్పీడ్‌ పెరుగుతోంది. ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లి…ఠాక్రే ఎవరు చెప్పితే వింటారో కూడా విచారిస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు ముందు రాష్ట్ర ఇంచార్జిలుగా వ్యవహరించిన ద్విగిజరుసింగ్‌, రామచంద్రకుంతియా, మాణిక్యం ఠాగూర్‌లను కొంత మంది నేతలు ప్రసన్నం చేసుకుంటున్నట్టు తెలిసింది. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ మురళీధరన్‌ సొంత రాష్ట్రమైన కేరళ కూడా వెళ్లి పౖౖెరవీలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పార్టీ మాత్రం సమర్థత, ప్రజల్లో పలుకుబడి, వారు చేస్తున్న కార్యక్రమాలు బేరిజు వేసి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి కొన్ని చోట్ల ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని భావిస్తోంది. వారు పార్టీకి అన్ని సహయ,సహకారాలను అందించేటట్టు ఆదేశించింది. కొంత మందికి పార్టీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ఇస్తామని ఒప్పిస్తున్నది. ఈసారి ఫైరవీలకు తావులేదంటూ అధిష్టానం చెబుతున్నా…నాయకులు వారి మాటలను పెడచెవిన పెట్టి ఢిల్లీకి వెళ్లారని కొంత మంది నేతలు పెదవి విరుస్తున్నారు.