కాంగ్రెస్‌ వైపు నేతల చూపు

Leaders look towards Congress– లోక్‌సభ ఎన్నికల వేళ రసవత్తరంగా రాష్ట్ర రాజకీయం
– గుంభనంగా హస్తం పార్టీ వ్యూహాలు
– తాజాగా కారు దిగిన తాటికొండ
– అదే బాటలో మరికొందరు సీనియర్లు
– ఆపేందుకు బీఆర్‌ఎస్‌ యత్నాలు
– పార్టీకి జవసత్వాలు నింపే పనిలో గులాబీ బాస్‌
పైకి ప్రశాంతంగా, ఏమీ జరగనట్టుగా ఉన్నా… రాష్ట్ర రాజకీయాల్లో లోలోపల ఏదో జరుగుతున్న అలజడి. ఆర్భాటం, హడావుడి, హంగామా లాంటివి ఎక్కడా కనబడకున్నా.. చాపకింద నీరులా నేతలు తమ ‘రాజకీయ భవిష్యత్‌’ గురించి పక్కాగా ప్రణాళికలేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా లోక్‌సభ ఎన్నికల సమయం లోనైనా, ఆ తర్వాతైనా గోడ దూకేందుకు వీలుగా మార్గం సుగమం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితి ఇది. పదేండ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుని కాంగ్రెస్‌ జోరు మీదుండగా, అదే పవర్‌ను కోల్పోవటంతో నాయకులు, కార్యకర్తలను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే పదవులు, సీట్లను ఆశిస్తున్న నేతలు మాత్రం కాంగ్రెస్‌ తమ ఇంటి వైపునకు ఇప్పుడే రావద్దన్నా.. బీఆర్‌ఎస్‌ గోడదూకి పోవద్దన్నా… మాట వినేట్టు లేరు. హస్తం పార్టీ వద్దన్నా.. గులాబీ పార్టీ గట్టిగా పట్టుకున్నా, ఆగేదే లేదు, తగ్గేది అంతకంటే లేదు, కచ్చితంగా పార్టీ మారాల్సిందే, అధికార పార్టీ పంచన చేరాల్సిందే అనే రీతిలో వారు వ్యవహరిస్తుండటం గమనార్హం.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్‌ను పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కలుస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ప్రజల తరపున వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంను ఎవరు కలిసినా తప్పు ఉండదు. కానీ త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారం లోకి వస్తుందంటూ గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో…అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే వాదనలు వినబడుతున్నాయి. ఆ క్రమంలోనే వారానికి కొద్ది మంది చొప్పున బీఆర్‌ఎస్‌ నేతలు సీఎంను కలుస్తున్నారనే అభిప్రా యాలు కూడా వస్తున్నాయి. దీంతోపాటు కాంగ్రెస్‌ ఉచ్చులో పడొద్దంటూ తమ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన వారిని బీఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆర్‌ హెచ్చరించటం ఈ వాదలనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. హైదరా బాద్‌ కేంద్రంగా ఇలాంటి పరిణా మాలు కొనసాగుతున్న తరుణంలోనే జిల్లాలు, నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మెన్లపై అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రతిపాదించిన ఇలాంటి తీర్మానాల్లో కాంగ్రెస్‌ నెగ్గి, మున్సిపల్‌ పీఠాలను కైవసం చేసుకుంది కూడా. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి చెప్పలేకుండా ఉంది. ఇలా బీఆర్‌ఎస్‌ ఓడిపోయి, అలా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందో లేదో… పోలోమంటూ సర్పంచులు, వార్డు మెంబర్లు మూడు రంగుల కండువాలను కప్పుకుంటున్నారు. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రసన్నం చేసుకోవటం కోసం వారు పడరానిపాట్లు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల్లో ధైర్యం నింపటం, నాయకులను కాపాడు కోవటంపై బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు సీరియస్‌గా దృష్టి సారించారు. మొన్నటిదాకా పార్లమెం టు సన్నాహక సమావేశాల రూపంలో క్యాడర్‌లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు.. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తామంటూ భరోసానిస్తున్నారు. మరోవైపు అత్యధికంగా ఉన్న బీసీ జనాభాను తమ వైపునకు తిప్పుకునేందుకు వీలుగా కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ‘జ్యోతిబా పూలే’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీసీ సంఘాల నేతలతో ఆమె ప్రతీరోజూ సమావేశమవుతూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే సమయంలో తాను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించానని చెప్పుకునేందుకు వీలుగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌… కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఈనెల్లో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో తనదైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడటం ద్వారా బీఆర్‌ఎస్‌కు మళ్లీ జవసత్వాలు నింపేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి లోక్‌సభ ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో వేచి చూడాలి.
వీరి దారెటు..?
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తాజాగా కారు దిగి.. కాంగ్రెస్‌ కండువా కప్పుకునేం దుకు రెడీ అవటంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఆయనకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టిక్కెటివ్వలేదు. ఇప్పుడు రాజయ్య వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించి, ఆ మేరకు హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే రకంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి తదితరులు కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారనే గుసగుసలు వినబడుతు న్నాయి. వీరితోపాటు హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కూడా శనివారం సీఎం రేవంత్‌తో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆమె తండ్రి కే.కేశవరావు మాజీ పీసీసీ అధ్యక్షుడు కావటం, ఆయనకు కాంగ్రెస్‌ జాతీయ నేతలతో సైతం విస్తృతమైన సంబంధాలు ఉండటంతో విజయలక్ష్మి కూడా హస్తం గూటికి చేరతారా..? అనే చర్చ మొదలైంది. అయితే ఆమె మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేశారు. మేయర్‌ హోదాలో అధికారికంగా మాత్రమే తాను ముఖ్యమంత్రిని కలిశాననీ, ఇందులో ఎలాంటి రాజకీయ కారణాల్లేవని వివరణిచ్చారు. ‘ప్రజా సమస్యలపై సీఎంను గానీ, మంత్రులను గానీ కలవాలనుకుంటే ప్రజల సమక్షంలోనే వారికి వినతిపత్రాలు ఇవ్వండి…’ అంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సూచించిన 24 గంటల్లోనే విజయలక్ష్మి.. సీఎంతో ప్రత్యేకంగా భేటీ కావటం గమనార్హం.