లిక్కర్‌ స్కాంకు ఆధ్యులు వైసీపీి, బీఆర్‌ఎస్‌ నాయకులు

– సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లిక్కర్‌ స్కాం ఆధ్యులు వైసిపి, బిఆర్‌ఎస్‌ నాయకులని, కానీ వారు మాత్రం జైల్లో ఉండరని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. శనివారం ఎపి, తెలంగాణ భవన్‌ వద్ద నారాయణ మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌- బిజెపికి సయోధ్య ఉందని, అందుకే కవిత అరెస్టు కాలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐతో విచారణ ఎందుకు జరపలేదో బిజెపి నేతలు సమాధానం చెప్పాలన్నారు. ప్రసుత్తం కెసిఆర్‌ను కాపాడేందుకే సిబిఐతో విచారణ అంశాన్ని బిజెపి తెరమీదకు తీసుకొస్తుందని ఆరోపించారు.
కాళేశ్వరం అవినీతి బయటకు తీసుకొచ్చే ఉద్దేశ్యం బిజెపికి లేదని అన్నారు. అలాగే, ఎలక్టోలర్‌ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని, రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేసేందుకే ఎలక్టోలర్‌ బాండ్లను తీసుకొచ్చారని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా మోడీ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఏవీ అమలు కావడం లేదని, అదానికి ఇచ్చిన గ్యారెంటీ మాత్రమే అమలు అయిందని తెలిపారు. మోడీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని, సెక్యులరిజం ఉండదని విమర్శించారు. కేజ్రీవాల్‌ వంటి నాయకులను సిబిఐ, ఇడి సంస్థలను ప్రయోగించి హింసిస్తున్నారని దుయ్యబట్టారు. రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు ఉంటేనే సిసోడియాను జైల్లో వేసిన మోడీ, వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న జగన్‌ ను ఎందుకు వదిలేశారని విమర్శించారు. ధరల పెరుగుదల, ఉద్యోగాల కల్పన, రైతుల స్థితిగతులపై బిజెపి జాతీయ సమ్మేళనంలో చర్చిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఓడిపోతారనే భయంతోనే రామ జపం చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు రైతులు ఆందోళనలో ఉంటే మరోవైపు మోడీ దేవాలయాలు ప్రారంభిస్తూ పల్లకి సేవలో ఉన్నారని దుయ్యబట్టారు.