– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంత్రి సీతక్క సమాక్షంలో బోథ్ ఇన్‌చార్జి ఆడే గజేందర్ నేతృత్వంలో పలువురు నాయకులు చేరారు. వారికి కండువా కప్పి సీతక్క పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి బీఆర్‌ఎస్ పెద్ద సమస్యగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రజలను రెచ్చగొట్టిలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలను టీఆర్‌ఎస్ మానుకోవాలని హెచ్చరించారు. పదేండ్లలో ఏ సమస్యను పరిష్కరించకుండా ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారంటూ చెప్పిన బీఆర్‌ఎస్…అధికారంలోకి వచ్చాక కేవలం 400 మందికి మాత్రమే కుదించారని విమర్శించారు. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి కులాల లెక్కలను తేల్చారని గుర్తు చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆమె ఆరోపించారు.
నరేందర్‌రెడ్డికి బీపామ్ అందజేసిన సీఎం
ఆదిలాబాద్,మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దిగుతున్నది. పార్టీ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గురువారం ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీపామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.