– ఢిల్లీ హైకోర్టులో పిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో తమాషా అయిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్) పడింది. అరెస్టయి జైళ్లలో ఉన్న రాజకీయ నాయకులను 2024- సార్వత్రిక ఎన్నికల్లో వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా ప్రచారం నిర్వహించేందుకు అనుమతించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది ఇమ్రాన్ అహ్మద్ ద్వారా న్యాయ విద్యనభ్యసిస్తున్న చివరి సంవత్సరం లా విద్యార్థి అమర్జీత్ గుప్తా ఈ వ్యాజ్యం వేశారు. జైలు నుంచి వీసీ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, వ్యవస్థను నెలకొల్పేలా ఇసిని ఆదేశించాలని పిల్‌లో కోరారు. ఇదిలా ఉండగా రాజకీయ కక్షల కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నించినా వారికి బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలోనే పిల్ దాఖలైనట్టు తెలుస్తోంది. కాగా రాజకీయాల్లో ఉంటూ నిజంగా తీవ్ర నేరాలు చేసి జైలుకెళ్లిన వారికి సైతం వీసీ. ద్వారా ప్రచారం నిర్వహించే వెసులుబాటు కల్పిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, చట్టాల ఉల్లంఘన అవుతుందన్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు.