
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ముగ్గురు పిల్లలు ఉన్న నాయకులు ప్రజలకు సేవ చేయకూడదా..? అని యాదగిరిగుట్ట బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు కవిడే మహేందర్ ప్రశ్నించారు. శనివారం, జనగామ జిల్లా కొడకండ్ల మండలం గీర్ని తండలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టిఎస్ జిసిసి చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ధరవత్ కు కవిడే మహేందర్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు సంతనోత్పత్తి లేక మానవ వనరుల కొరతతో బాధపడుతున్నాయని అన్నారు. చైనా, సౌత్ కొరియా, రష్యా వంటి దేశాలు సంతాన ఉత్పత్తి పెంచేందుకు వివిధ పథకాలను ప్రవేశ పెడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఇలాంటి నిబంధన వల్ల మానవ వనరుల విషయంలో, అభివృద్ధి విషయంలో భవిష్యత్తులో రాష్ట్రం వెనుకబడే ప్రమాదం ఉందని అన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్న నాయకులకు వచ్చే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటి చేసే అవకాశం కల్పించాలి అన్నారు. పక్కకున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో లేని నిబంధన మనకు ఎందుకు అని అన్నారు. ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించకపోతే రాబోవు రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తా రోకోలు నిరసన దీక్షలు నిర్వహిస్తాము అని అన్నారు. అవకాశం కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడమని అన్నారు.