పురుషాధిక్యతను తిప్పకొట్టడం అమ్మ నుండి నేర్చుకున్నా..

ఊర్వశి బుటాలియా… ప్రచురణ కర్త, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. మీ టూ ఉద్యమంతో పాటు అనేక మహిళా స్వరాలను డాక్యుమెంట్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బలమైన పితృస్వామ్య భావజాలంలో పుట్టి పెరిగిన పంజాబీ అమ్మమ్మ. తిరుగులేని పురుషాధిక్యతను ఎలా తిప్పికొట్టాలో తన కుమార్తెలకు నేర్పింది 72 ఏండ్ల ఈ స్త్రీవాది. ఇటీవల కోజికోడ్‌లో జరిగిన కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాలు గుర్తు చేసుకున్నారు. వాటిని మనతో ఇలా పంచుకున్నారు.
‘మా అమ్మమ్మ సాంప్రదాయ పంజాబీ మహిళ. ఆమె ఎప్పుడూ తన కొడుక్కే మొదటి ప్రాధాన్యం ఇచ్చేది. తర్వాత నా ఇద్దరు సోదరులు, నా సోదరి, నేను. మా అమ్మను చివరి స్థానంలో ఉంచేది. ఉపాధ్యాయురాలిగా ఉన్న మా అమ్మ, మా అమ్మమ్మను బహిరంగంగా వ్యతిరేకించే సాహసం చేయలేదు. కానీ ఇంట్లో జరిగే యుద్ధాలను గెలవడానికి నాకు మాత్రం చిన్న చిన్న చిట్కాలను నేర్పింది’ అని ఆమె గుర్తుచేసుకుంది. ఆమె అమ్మమ్మ తిండి విషయంలో మగవాళ్లకే ప్రాధాన్యం ఇచ్చేది. చాలా మంది పంజాబీ స్త్రీలు ఇలాగే వ్యవహరించేవారు. ఆహారాన్ని మగవాళ్ళ కోసం ట్రంక్‌ పెట్టెలో దాచి పెట్టేది. దాని తాళం చెవిని తన సల్వార్‌ డ్రెస్‌కు కట్టి ఉంచుకునేది. ‘మధ్యాహ్నాలు మా అమ్మమ్మ నిద్రపోతున్నప్పుడు దొంగతనంగా తాళం తీయడం, మేము తినాలనుకున్నది తీసుకోవడం వంటికి మా అమ్మ మాకు నేర్పింది’ అని ఊర్వశీ నవ్వుతూ చెప్పారు. ఆ యువతి ఇప్పుడు ప్రముఖ స్రీవాదిగా మారారు. 1960లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకునేటపుడు రాజకీయ స్పృహ పెంచుకుంది.
ఉద్యమానికి నాయకత్వం
1960లో విశ్వవిద్యాలయాల హాస్టళ్లలో ప్రతికూల పరిస్థితులు ఉండేవి. అయినా మహిళలు ఎదుర్కొంటున్న రవాణాతో పాటు అనేక సమస్యలపై చర్చలకు కేంద్రంగా మారాయి. మహిళలు యూనివర్శిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌లో భాగం కావాలని, అలాగే భారతదేశ వ్యాప్తంగా పని చేస్తున్న మహిళా సంఘాలతో కలిసి పని చేయాలనే చర్చ తీవ్రంగా జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఆమె తన సన్నిహితులతో కలిసి వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేశారు. లైంగిక దాడులకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి నాయకత్వం వహించారు. స్త్రీవాద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న ఊర్వశి అప్పట్లో స్త్రీల సమస్యలకు అంకితమైన మానుషి అనే పత్రికను ప్రారంభించిన బృందంలో భాగమయ్యారు.
రెండు అభిరుచులు
‘ఆ నాటి సాహిత్యం చాలా వరకు వాస్తవాలకు చాలా దూరంగా ఉండేది. అందుకే నేనే సాహిత్యాన్ని సృష్టించాలనుకున్నాను. కాబట్టే ప్రచురణా రంగంలో అవకాశం వచ్చినపుడు ఆనందంగా దానిని స్వీకరించాను. క్రమంగా నా రెండు అభిరుచులు కలిసి వచ్చాయి. రెండింటినీ కలపడం నాకు దక్కిన మంచి అవకాశం’ ఆమె చెప్పారు. నలభై ఏండ్ల కిందట ఊర్వశి రీతూ మీనన్‌తో కలిసి కాళీ ఫర్‌ ఉమెన్‌ని స్థాపించారు. ఇది మహిళల కోసం భారతదేశంలో ఏర్పడిన మొదటి ప్రచురణ సంస్థ. ఇది అనేక గొప్ప గొప్ప శీర్షికలను ప్రచురించింది. 2003లో ఆమె వివాద అధ్యయనాలు, ఆరోగ్యం, మానవ హక్కులు, లింగ న్యాయం, స్త్రీవాద, క్వీర్‌ సిద్ధాంతం వంటి విషయాలపై దృష్టి సారించారు. తర్వాతర ఫిక్షన్‌, నాన్‌-ఫిక్షన్‌ రెండింటినీ ప్రచురించే స్వతంత్ర స్త్రీవాద ప్రచురణ సంస్థ అయిన జుబాన్‌ బుక్స్‌ను స్థాపించారు.
మహిళల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి
నాలుగు దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలకు బలమైన స్త్రీవాద గొంతుగా ఉన్న ఆమె భారతదేశంలో స్త్రీవాద పరిణామానికి సాక్షి. దేశంలో సామాజిక ఉద్యమ సుదీర్ఘ చరిత్రలో #MeToo దాని వేగాన్ని కొనసాగించడంలో విఫలమైందని చాలా మంది భావిస్తున్నారు. కానీ దీంతో ఆమె ఏకీభవించలేదు. దేశంలో #MeToo ఉద్యమం 2008కి చాలా ముందే ప్రారంభమైందని చెప్పారు. ఆమె ప్రకారం రూపన్‌ డియోల్‌ బజాజ్‌1988 కేసు,POSH చట్టానికి దారితీసిన విశాఖ మార్గదర్శకాలను అమలులోకి తెచ్చిన భన్వరీ దేవి కేసు, మిస్‌ X Vs అపెరల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ కేసు… ఈ మూడు ముఖ్యమైన కేసులు మహిళల ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. అప్పటి నుండి మహిళలు తమపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ‘ఉద్యమం విఫలమైందని నేను అనుకోను. చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇప్పటికీ సమాజంలో బలంగా పాతుకు పోయిన పితృస్వామ్య భావాలను ఇది మనకు చూపింది. చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఉన్న చట్టాలను మహిళలు ఉపయోగించు కోవాలి. న్యాయం కోరడం మన హక్కు’ ఆమె చెప్పారు.
మిశ్రమ స్పందన
సమాజంలో ప్రస్తుతం సోషల్‌ మీడియా ఒక మిశ్రమ స్పందన వంటిదని ఆమె నమ్ముతున్నారు. ఇంతకు ముందెన్నడూ చేయలేని విధంగా సోషల్‌ మీడియా ద్వారా విషయాలను వ్యక్తీకరించే అవకాశం వచ్చింది. అదే సమయంలో ట్రోలింగ్‌ వంటి విషపూరితమైన ప్రదేశానికి కూడా ఇది వేదికగా మారింది. ‘సోషల్‌ మీడియా ఒత్తిడికి గురికాకుండా మనం స్పృహతో ఉండాలి. దానితో ప్రతిస్పందించాలనే ఒత్తిడి అందరిపై ఉంటుంది. తొందరపడితే మాత్రం తర్వాత పశ్చాత్తాప పడాల్సిందే. ఇటీవల డిజిటల్‌ మీడియాలో ప్రభావితమైన స్త్రీవాదం గురించి మాట్లాడిన మీనా పిళ్లైతో కూడిన ప్యానెల్‌లో నేను భాగమయ్యాను. అంతర్జాతీయ స్థాయిల్లో తమ బృందాలను నిర్మించుకునేందుకు ఇది సహాయపడింది. సోషల్‌ మీడియా ఇచ్చిన సానుకూల ప్రయోజనాల్లో ఇది కచ్చితంగా ఉంటుంది’ ఆమె వివరించారు. అలాగే మన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం వల్ల ఒంటరితనాన్ని దూరం చేస్తుందని కూడా ఆమె అంగీకరించారు.
వనరులు లేకపోవడంతో…
ది అదర్‌ సైడ్‌ ఆఫ్‌ సైలెన్స్‌: వాయిస్స్‌ ఫ్రమ్‌ అండ్‌ ది పార్టిషన్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ స్పీకింగ్‌ పీస ్‌: విమెన్స్‌ వాయిస్‌ ఫ్రమ్‌ వంటి కాశ్మీర్‌ రచనలు, మౌఖిక చరిత్రలు మహిళల గొంతులను తెలుసుకునేందుకు, ముందుకు సాగడానికి చాలా అవసరమని ఆమె చెప్పారు. ‘మేము దీన్ని చేయడానికి కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇంత భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి మాకు ఎలాంటి వనరులు లేవు. నేను పదవీ విరమణ చేసే ముందు మహిళల స్వరాల ఆర్కైవ్‌ను రూపొందించి వాటిని విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచడం నా కల’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
– సలీమ