– డీఆర్‌డీఓ చైర్మెన్ డా.సమీర్ వి కామత్
– ఘనంగా ఎన్‌ఐటీ వరంగల్ 22వ స్నాతకోత్సవం
– విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం
– 11 మందికి బంగారు పతకాలు
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
విద్యాభ్యాసం ఒక్కరోజుతో ముగియదని, నేర్చుకోవడం నిరంతరం కొనసాగుతుందని డీఆర్‌డీఓ చైర్మెన్ డాక్టర్ సమీర్ వి కామత్ అన్నారు. వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్‌లో శనివారం 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ చైర్మెన్ డాక్టర్ సమీర్ వి కామత్ చేతుల మీదుగా 1875 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అందులో 11 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. ఉత్తమ పీహెచ్‌డీ థీసిస్, పీజీ విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఎన్‌ఐటీ ఇన్‌స్టిట్యూట్ హెల్త్ సెంటర్‌ను డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్, డీఆర్‌డీఓ చైర్మెన్ డాక్టర్ సమీర్ వి కామత్ ప్రారంభించారు. జాతీయ గీతం ఆలాపన అనంతరం ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ కాన్వకేషన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సమీర్ వి కామత్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ అవటం విద్యార్థుల అదృష్టమన్నారు. దేశ నిర్మాణానికి సహకరించే బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. నిట్ వరంగల్ పూర్వ విద్యార్థులు, డీఆర్‌డీవో సహా ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాల్లో సహకరిస్తున్నారన్నారు. డీఆర్‌డీవోలో తన మొదటి బాస్ నిట్ వరంగల్‌కు చెందిన పూర్వ విద్యార్థి అని, ఆయన మార్గదర్శకత్వం వల్లే నేడు ఇక్కడ ఉన్నానని చెప్పారు. మీరు ఆనందించే పనిని మీరు గ్రహిస్తే, మీరు బాగా పని చేసే అవకాశం ఉందని తెలిపారు. డీఆర్‌డీఓ 1958లో ఏర్పడిందని, ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్‌డి విభాగం అని, క్షిపణి సాంకేతికత విషయానికి వస్తే ఒక దేశంగా మనం ప్రపంచంలోని అగ్రగామిగా ఉన్నామని వివరించారు. దేశవ్యాప్తంగా 15 విద్యాసంస్థల్లో 15 డీఆర్‌డీవో అకడమిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రారంభించామని తెలిపారు. డీఆర్‌డీవోకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, మీలో కొందరు దీనిని ఎంచుకోవాలని సూచించారు.
నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. కాన్వకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ విద్యార్థులు, తల్లిదండ్రుల కలలు కనే కార్యక్రమం అని అన్నారు. గ్రాడ్యుయేషన్ విద్యార్థులు సామాజిక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేయాలని సూచించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 300 కంపెనీలు వచ్చాయని, గతేడాది ఇనిస్టిట్యూట్ నుంచి అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ తీసుకున్న విద్యార్థులు ఉన్నారని చెప్పారు. సమర్థవంతమైన పాలన కోసం నిట్ వరంగల్‌లో నవంబర్ 2023 నుంచి ఇ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.ఈ కాన్వకేషన్‌లో మొత్తం 1875 మంది అభ్యర్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 147 మంది పీహెచ్‌డీ., 539 మంది ఎంటెక్, 154 మంది ఎంఎస్సీ, 22 మంది ఎంబీఎ, 55 మంది ఎంసీఎ డిగ్రీ గ్రహీతలు, 949 మంది బిటెక్ డిగ్రీ అవార్డు గ్రహీతలు, జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఇపీ) అనుగుణంగా నిష్క్రమణ విధానంలో మరో 9 డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సంవత్సరం కాన్వకేషన్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి చెందిన మంజిమా కర్మాకర్ ఇన్‌స్టిట్యూట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. మనీషా వర్షినీ, ఎంసిఏ, అన్ని పిజి ప్రోగ్రామ్‌లలో టాపర్‌గా నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు. అరుణ్ కుమార్, కెమిస్ట్రీ, ఉత్తమ పీహెచ్‌డీ థీసిస్‌కి రోల్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్నారు.