ఉండలేను బందీఖానాలో వదిలిపెట్టండి బాబూ
నన్ను నేను స్కానింగ్ చేసుకోవాలి
కాలి గోర్ల నుంచి నెత్తెంటికలదాకా ప్రతిదీ
లోపమెక్కడుందో.. తాపకో రోగం బయటపడుతుంది
అదుపుతప్పిన నోరు, నెత్తికెక్కిన కళ్ళు, శ్వాసలో బుసలు
అహం, అత్యాశ, నియంతత్వం, కోపం, మోసం
దౌర్బల్యాలు దండిగా శాసిస్తున్నాయి నన్ను
సర్కస్ బోనులో పులిలా ఆడిస్తున్నాయి
నాపై నాకు అతి నమ్మకం, అప నమ్మకం
అన్నీ నన్ను ఖైదు చేసి ఆడుకుంటున్నాయి
నన్ను త్వరగా విడిచిపెట్టండి
బాల్యంలోని మనిషి తనాన్ని మళ్లీ తెచ్చుకోవాలి
తరాల కింద ఎండిన మానవత్వం మొక్కకు తిరిగి పాదు కట్టాలి
మమతల ఎరువు వేయాలి, స్పందన గుణం అంటు కట్టాలి
సంకెళ్లను బద్దలు కొట్టుకొని
మొద్దును దూగోడా పట్టాలి, శిలను శిల్పంలా చెక్కాలి
దౌర్భాల్యాల జలపాతాన్ని తట్టుకునేలా
నిండు గుండెను బండరాయిలా అడ్డు నిల్పాలి
సముద్రం పాలు కాని నదిలా పొలాలకు పారాలి
నన్నొదిలిపెట్టండి బాబూ
జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగింది
అక్కరకు రాని కొవ్వు పెరిగింది
పెరిగిన కొమ్ములు కుమ్ముతున్నాయి
మదమెక్కినట్లు, ఇష్టమొచ్చినట్లు
ప్రశ్నలను కాళ్ళ కింద నలిపేసిన వెన్నో
నన్నవి కాదు నేనే వాటిని వదిలిపెట్టాలి
నన్ను నేను సొక్కం బంగారంలా చేసుకునేందుకు
కరిగించుకోవాలి, పుటంపెట్టుకోవాలి
జనానికి జాతి జెండా కావడానికి సిద్ధం చేసుకోవాలి
– కొమురవెల్లి అంజయ్య, 9848005676