– టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఉపాధ్యక్షులు మ్యాన పవన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలు చెప్తున్న గ్రామ ప్రజలకు, సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్వే విధుల నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మినహాయింపు ఇస్తూ ఆ రోజు సర్వేకు సెలవు ప్రకటించాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ఉద్యోగులు సర్వేను విజయవంతం చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కానీ వారికి సర్వేలో ఎదురవుతున్న సమస్యలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.