హింసను వీడి జనంలో కలవండి: ఆళ్ళపల్లి ఎస్సై ఈ.రతీష్

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మావోయిస్టులు హింసను వీడి జనంలో కలిసి అభివృద్ధిలో భాగం కావాలని ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఎస్ఐ శనివారం ఆళ్ళపల్లితో పాటు మర్కోడు, అనంతోగు, పెద్ద వెంకటాపురం తదితర గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో మావోలకు అవగాహనకై ఫ్లెక్సీలు పెట్టించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..మావోయిస్టులారా! మీ కోసం ఎప్పటికీ మీ కుటుంబం ఎదురుచూస్తుందని, మీ ఊరు రమ్మంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హింసా మార్గం వీడాలన్నారు. మీ స్వేచ్ఛకు, అభివృద్ధికి భరోసా తెలంగాణ ప్రభుత్వమని, కాలం చెల్లిన సిద్ధాంతాలు వీడి, పోతే తిరిగి రాని అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందని చెప్పారు. పోలీసుల వద్దకు వచ్చి వెంటనే మీ ఇంటికి క్షేమంగా వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. మీకు తెలంగాణ ప్రభుత్వం సైతం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కె.ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.