15 రోజులుగా నీళ్లు లేవ్‌.. ఖాళీ బిందెలతో

– రోడ్డెక్కిన మహిళలు
నవతెలంగాణ-వెంకటాపురం
మూడు నెలలుగా తాగు నీటికోసం అవస్థ.. 15 రోజులుగా తాగునీరు వచ్చినా రెండు బిందెలే.. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగి వేసారిన ములుగు జిల్లా వెంకటాపురం ఉప్పెడు గొల్లగూడెం మహిళలు మంగళవారం భద్రాచలం-వెంకటాపురం ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైటాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ సంఘటన ప్రాంతానికి వెళ్లారు. ఆందోళన విరమించాలని గ్రామస్తులతో చర్చించారు. 15 రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరు మరమ్మతులకు గురైందని వివరించారు. బోరు పనిచేయక, పంచాయతీ నల్ల రాక తాగునీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్‌, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు.
సంబంధిత అధికారులు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అధికారులు ఫోనులో గ్రామస్తులతో మాట్లాడి స్పష్టమయిన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.