నెతన్యాహూ ఆమోదంతోనే లెబనాన్‌ పేజర్‌ పేలుళ్లు

జెరూసలెం : గాజా, లెబనాన్‌లపై అమానుష దాడులతో విరుచుకుపడుతున్న నెతన్యాహూ ప్రభుత్వం ఇటీవల లెబనాన్‌లో పేజర్‌ పేలుళ్లకు పాల్పడినట్లు ప్రకటించింది. లెబనాన్‌లో పేజర్‌ పేలుళ్లకు తాను ఓకె చెప్పినట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. నెతన్యాహూ ఆమోదంతోనే లెబనాన్‌లో పేజర్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఆదివారం ఆయన ప్రతినిధి ఒమర్‌ దోస్త్రీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నెతన్యాహూ ధవీకరించారని అన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో లెబనాన్‌లోని సూపర్‌మార్కెట్లు, వీధుల్లో హిజ్బుల్లా కార్యకర్తలు వినియోగించిన పేజర్లు వరుసగా రెండు రోజుల పాటు పేలిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల్లో పాల్గొన్న హిజ్బుల్లా కార్యకర్తలు వినియోగించిన పేజర్లు కూడా పేలాయి. ఈ ఘటనల్లో సుమారు 40 మంది మరణించగా, సుమారు 3,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు ఇజ్రాయిల్‌ కారణమని హిజ్బుల్లా గతంలోనే వాదించింది. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది.