ఏపీలో కుదిరిన విద్యుత్‌ పిఆర్‌సి

– అగ్రిమెంట్‌పై జెఎసి, యాజమాన్యం సంతకాలు
– కాంట్రాక్టు ఉద్యోగులకు నిరాశ
అమరావతి : విద్యుత్‌ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వేతన సవరణ ఒప్పంద (పిఆర్‌సి) అగ్రిమెంట్‌ కుదిరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పేస్కేల్‌ను ఆమోదిస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు సంతకాలు చేశారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌, జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలో విద్యుత్‌ సౌధలో బుధవారం రాత్రి వరకు చర్చలు జరిగాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సింగిల్‌ మాస్టర్‌ పేస్కేల్‌కు ఆమోదం తెలుపుతూ జెఎసి నాయకులు సంతకాలు చేశారు. ఫిట్‌మెంట్‌ 8 శాతానికి ఒప్పుకున్నారు. పెన్షనర్లు, వారి కుటుంబాలకు కూడా ఫిట్‌మెంట్‌ వర్తిస్తుంది. పిఆర్‌సి బెనిఫిట్స్‌, సవరించిన వేతనం 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నాయి. జెఎసి నాయకులు ప్రతిపాదించిన పాత ఇంక్రిమెంట్లకు ప్రభుత్వం ఒప్పుకుంది. పేస్కేల్‌లో అనామలీస్‌ ఉంటే సరిచేసేందుకు ట్రాన్స్‌కో జెఎమ్‌డి నేతృత్వంలోని మూడు డిస్కమ్‌ల సిఎమ్‌డిలతో హెచ్‌ఆర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని విజయానంద్‌ ప్రకటించారు. బుధవారం జరిగిన ఒప్పంద పత్రాలపై జెన్‌కో ఎమ్‌డి చక్రధర్‌బాబు, డైరెక్టర్‌ సయ్యద్‌ రఫీ, ట్రాన్స్‌కో జెఎమ్‌డి మల్లారెడ్డి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వీరభద్రారెడ్డి, సిపిడిసిఎల్‌ సిఎమ్‌డి పద్మ జనార్ధన్‌రెడ్డి, ఇపిడిసిఎల్‌ సిఎమ్‌డి పృథ్వీతేజ్‌, ఎస్‌పిడిసిఎల్‌ సిఎమ్‌డి సంతోష్‌రావు, ఉద్యోగ సంఘాల తరపున జెఎసి ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, కన్వీనర్‌ సాయికృష్ణ, వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నుంచి మహేశ్వరరెడ్డి, ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్‌ నాయకులు కిరణ్‌ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు 2018 పిఆర్‌సి
కొత్త పిఆర్‌సి ఒప్పందంలో కాంట్రాక్టు ఉద్యోగులకు నిరాశ మిగిలింది. విద్యుత్‌ సంస్థల్లో సుమారు 60వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 30వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు. ఏదైనా పిఆర్‌సిని అమలు చేసే సమయంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు వీరికి కూడా కొంత పెంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి అమలు చేస్తాయి. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి వేతన పెంపు చేయలేదు. 2018 పిఆర్‌సి అంటే పాత వేతనంపై కేవలం 2 శాతం మాత్రమే పెంచింది. పెంచిన వేతనాన్ని కూడా పిఆర్‌సి అమలు తేదీ 2022 ఏప్రిల్‌ 1 నుంచి కాకుండా ఆగస్టు నుంచి పెంచుతామని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఒప్పందానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మధ్య జరిగిన పిఆర్‌సి ఒప్పందానికి వ్యతిరేకంగా ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ సంతకాల సేకరణ చేపట్టనుంది. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఒప్పందం జరిగిందని, ఇది తప్పుడు వేతన ఒప్పందమని స్ట్రగుల్‌ కమిటీ భావిస్తోంది. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి సంతకాల సేకరణ చేపడుతుంది. అనంతరం ఈ సంతకాలను కార్మిక శాఖకు అందించనుంది. ప్రస్తుత పిఆర్‌సిపై అన్ని తరగతుల ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. కొత్త వేతనం అమలు చేస్తే వేతనాలు పెరగాలని, కానీ ప్రభుత్వం రివర్స్‌ పిఆర్‌సి ఇచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతకాల సేకరణతో పాటు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా స్ట్రగుల్‌ కమిటీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.