మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బందం కూడా అదే ట్రెండ్‌ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. గీత రచయిత కాసర్ల శ్యామ్ తన మాస్ పదాలతో పాటను తప్పక వినేలా చేశారు. నకాష్ అజీజ్, ఇంద్రావతి చౌహాన్ అద్భుతమైన గాత్రంతో మాస్ లిరిక్స్‌కు ఎనర్జీని ఇచ్చారు. మాస్, ఎనర్జీ కలిసి ఈ పాటను మాస్ బ్లాస్ట్‌గా మలిచాయి. ఈ పాట విడుదల వేడుక పార్క్ హయత్‌లో బుధవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, ‘ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ సెట్‌కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది’ అని అన్నారు. ‘ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి పేరుతో మా ‘ఆదికేశవ’ వస్తుంది. ‘లీలమ్మో’ నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకమైన పాట. ఈ సాంగ్‌ని మీ అందరూ ఎంజారు చేస్తారు. వైష్ణవ్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలనిపించింది. అంతా బాగుంటుంది ఈ పాట’ అని కథానాయిక శ్రీలీల చెప్పారు.
దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రథమార్థం అంతా వైష్ణవ్, శ్రీలీల, సుదర్శన్‌తో ఎంతో సరదాగా
సాగి పోతుంది. సెకండాఫ్‌లో యాక్షన్ ఉంటుంది. ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తుంది’ అని తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.