కేజ్రీవాల్‌ అరెస్టుపై వామపక్షాల నిరసన

కేజ్రీవాల్‌ అరెస్టుపై వామపక్షాల నిరసన– మోడీ నిరంకుశ విధానాలపై ఆగ్రహం
నవతెలంగాణ- విలేకరులు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి.. అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఈసీఐఎల్‌ కమలానగర్‌ సీపీఐ(ఎం) ఆఫీసు నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును ఖండిస్తూ ఇబ్రహీంపట్నం ప్రధాన చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ వైస్సార్‌ కార్కిల్‌లో సీపీఐ(ఎం)-సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కార్యదర్శి డి.కురుమయ్య, సీపీఐ నాయకులు రమేష్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద నిరసన తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా ఆధ్వర్యంలో ప్లకార్డులతో మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.