లాటిన్ అమెరికాలోని ఉరుగ్వే అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి వామపక్ష కూటమి ”విశాల వేదిక ” (బ్రాడ్ ఫ్రంట్) మరోసారి విజయం సాధించింది.గతంలో 2005 నుంచి 2020వరకు అధికారంలో ఉన్న ఈ కూటమి ఐదేండ్ల క్రితం మితవాద శక్తుల చేతిలో ఓటమి పాలైంది.ఈసారి తిరిగి అధికారానికి వచ్చింది. అక్టోబరు 27న జరిగిన ఎన్నికల్లో నిబంధనల ప్రకారం 50శాతంపైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య నవంబరు 24న తుది ఎన్నిక జరిగింది. విశాల వేదిక కూటమి అభ్యర్ధి, గతంలో చరిత్ర అధ్యాపకుడిగా, మేయర్‌గా పనిచేసిన యమండు ఆర్సి(57) 52.08శాతం ఓట్లతో గెలిచారు. తొలి రౌండులో 46.12శాతం తెచ్చుకున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దిగువ సభ ఛాంబర్‌లో 99 డిప్యూటీల స్థానాలకు గాను ఆర్సి నాయకత్వంలోని కూటమికి 48, ఎగువ సభ సెనెట్‌లోని 30 సీట్లకు గాను 16 వచ్చాయి. తొలి రౌండులో ప్రత్యర్థులుగా ఉన్న రెండు మితవాద పార్టీల అభ్యర్థులు ఇద్దరికి కలిపినా 45.09శాతమే రావటంతో తుదిపోరులో వామపక్ష అభ్యర్థి విజయం ఖాయంగా కనిపించినప్పటికీ పోటీ తీవ్రంగా మారింది. మీడియా, ఇతర శక్తులు వామపక్ష వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ విశాల వేదిక విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నూతన ప్రభుత్వం 2025 మార్చి ఒకటవ తేదీన కొలువుతీరనుంది.స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాత్వత్వం మరోసారి విజయం సాధించింది, ఈ మార్గాన్నే పయనిద్దామంటూ తన విజయం ఖరారు కాగానే వేలాది మంది మద్దతుదార్లతో యమండు అర్సీ తన ఆనందాన్ని పంచుకున్నాడు. గత ఐదేండ్లలో తాము వామపక్ష సంఘటన కంటే ఎక్కువే చేశామని అధికారపక్ష రిపబ్లికన్ కూటమి చేసిన ప్రచారాన్ని ఓటర్లు ఆమోదించలేదు. తమ ఏలుబడిని చూసి ఐదేండ్ల కాలంలో జరిగిన కుంభకోణాలను జనం మరచిపోతారని అది భావించింది.తమను మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో ఓటర్లకు చెప్పలేకపోయింది.
ఉరుగ్వే నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సరైన కారణాలు చూపకుండా ఓటువేయని వారికి జరిమానా, ఇతర అనర్హతలకు గురౌతారు. దేశ జనాభా 35లక్షలుండగా పద్దెనిమిదేండ్లు దాటిన ఓటర్లు 27లక్షలు. ఇందులో 24లక్షలకు పైగా ఓటు వేశారు. ఏ అభ్యర్థి నచ్చకపోతే ఖాళీ బ్యాలట్ పత్రాలను పెట్టెల్లో వేయవచ్చు. ఒకేసారి అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికలు జరుగుతాయి గనుక ప్రతి ఒక్కరూ తొలి రౌండులో మూడు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పార్లమెంటు ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికల్లో విశాల వేదిక కూటమికి 43.94శాతం ఓట్లు వచ్చాయి. రద్దయిన సభలో ఉన్న సీట్లతో పోల్చితే దిగువ సభలో 42 నుంచి 48కి, ఎగువసభలో 13 నుంచి 16కు పెరిగాయి. అధ్యక్ష పదవికి వేసిన ఓటునే ఉపాధ్యక్ష పదవి అభ్యర్థికి కూడా వర్తింపచేస్తారు. ఆ విధంగా కరోలినా కోసె ఎన్నికయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజనీరైన ఆమె విద్యార్థిగా ఉన్నపుడు యువ కమ్యూనిస్టు లీగ్‌లో పనిచేశారు. తాజా ఎన్నికలలో విశాల వేదిక తరఫున ఎవరిని అభ్యర్థిగా నిలపాలన్న చర్చ వచ్చినపుడు యమందు ఆర్సి-కరోలినా పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఆమెను అభ్యర్థిగా నిలిపితే గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు మొగ్గుచూపకపోవచ్చని, గత ఎన్నికల్లో ఆ కారణంగానే ఫ్రంట్ ఓడిందని, ఈసారి ఆర్సితో ఆ లోపాన్ని సరి చేయాలని మాజీ అధ్యక్షుడు ముజికా సూచించటంతో ఆమెను ఉపాధ్యక్షురాలిగా నిలిపారు. గతంలో ఆమె మంత్రిగా పనిచేశారు. పార్లమెంటు దిగువ సభలో ఫ్రంట్‌కు వచ్చిన 48 సీట్లలో కమ్యూనిస్టు పార్టీకి ఐదు, సెనెట్‌లోని 16 సీట్లలో రెండు వచ్చాయి.ఉరుగ్వే మిలిటరీ నియంతలకు వ్యతిరేకంగా జరిగిన పోరుకు వామపక్ష నేత జోస్ ముజికా (88) నాయకత్వం వహించాడు. తరువాత 2010 నుంచి 15వరకు అధ్యక్షుడిగా పనిచేశాడు. పద్నాలుగు సంవత్సరాల పాటు వివిధ జైళ్ల చిత్రహింసలు, ఏకాంతవాస శిక్ష అనుభవించాడు. అధ్యక్ష పదవిని స్వీకరించిన తరువాత 90 శాతం వేతనాన్ని దేశానికే విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు అధ్యక్ష భవనం నివాసం తనకు అక్కరలేదని ప్రకటించాడు. ముజికా వారసుడిగా యమండు అర్సీని పరిగణిస్తున్నారు. ఒక ద్రాక్ష తోట రైతు కుటుంబంలో జన్మించిన అర్సీ తాను కూడా ముజికా బాటలోనే పయనిస్తానని ప్రకటించాడు.
చిన్న దేశమైనప్పటికీ ఉరుగ్వే ప్రపంచానికి పెద్ద సందేశమిచ్చిందనే చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువచోట్ల ఓడిపోయాయి. మితవాద ఫాసిస్టు శక్తులు ముందుకు వచ్చాయి. ఇక్కడ మితవాదులను ఓడించి జనం వామపక్షానికి పట్టం కట్టారు. గత పాతికేండ్లలో ఏ రాజకీయ పక్షం కూడా పది లక్షల ఓట్ల మార్కును దాటలేదు. తొలిసారిగా వామపక్షం ఆ ఘనతను సాధించింది. ఈ కూటమి ఇప్పటికి ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసింది.నాలుగు సార్లు అధికారానికి వచ్చింది. గతంలో గెలవని ప్రాంతాలు, నియోజకవర్గాలలో ఈసారి తన పలుకుబడిని పెంచుకుంది.పందొమ్మిది ప్రాంతాలలో(మన జిల్లాల వంటివి) పన్నెండు చోట్ల ప్రథమ స్థానంలో ఉంది. అన్ని చోట్లా దిగువ సభలో ప్రాతినిధ్యం పొందింది. ఈ ఎన్నికల సందర్భంగానే రెండు రాజ్యాంగబద్దమైన ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఓటింగ్ జరిగింది. లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన చోట్ల అధ్యక్ష పదవులు పొందినప్పటికీ పార్లమెంటులో మెజార్టీ లేని కారణంగా అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఉరుగ్వే ఎగువ సభలో మెజార్టీ ఉంది. దిగువ సభలో 99కి గాను 48 ఉన్నాయి.
మొత్తం లాటిన్ అమెరికా వామపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఉరుగ్వేలోని విశాల వేదిక కూడా ఎదుర్కొంటున్నది. గతంలో మూడుసార్లు అధికారానికి వచ్చినప్పటికీ అమల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కొనసాగిస్తూనే కార్మికులు, ఇతర తరగతులకు కొన్ని ఉపశమన, సంక్షేమ చర్యలను అమలు చేసింది. దాంతో సహజంగానే అసంతృప్తి తలెత్తి గత ఎన్నికల్లో మితవాదులను గెలిపించారు. గత పాలకుల వైఫల్యం తిరిగి వామపక్షాలకు అవకాశమిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన అర్సి ఒక పెద్ద జిల్లా గవర్నర్‌గా పనిచేశాడు. రెండవ దఫా ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉండగానే 49.8 శాతం ఓట్లు పొందిన అర్సి విజయం ఖాయంగా తేలటంతో ప్రత్యర్థి అల్వారో డెల్‌గాడో తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశాడు.దేశంలో వామపక్ష శక్తులు విజయోత్సవాలను ప్రారంభించాయి. విశాల వేదికలో కమ్యూనిస్టు, సోషలిస్టు, క్రిస్టియన్ డెమోక్రాట్లు భాగస్వాములు కాగా ప్రతిపక్ష రిపబ్లికన్ కూటమిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా మితవాద భావజాలానికి చెందినవే. విశాల వేదికలో కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ తమ అజెండాను పూర్తిగా ముందుకు నెట్టే అవకాశం లేదు.
లాటిన్ అమెరికాలో ఉన్నంతలో ఉరుగ్వే మెరుగైన స్థితిలో ఉన్నవాటిలో ఒకటి. అయితే పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నందున దానికి ఉండే జబ్బులకు కార్మికవర్గం గురవుతున్నది. వామపక్షాల పదిహేనేండ్ల పాలనలో మెరుగ్గా ఉన్నప్పటికీ కరోనా సమయంలో లాక్‌డౌన్‌లు, ఇతర ఆర్థిక సమస్యలను ఆసరా చేసుకొని ప్రతిపక్షం గత ఎన్నికల్లో లబ్ది పొందింది. జవాబుదారీ తనంతో కూడిన స్వేచ్ఛను ఇస్తామని, జనాన్ని తాళం వేసి ఉంచేది లేదని ఓటర్ల ముందుకు వెళ్లింది. గత ఐదేండ్లలో ఇరుగుపొరుగు దేశాలలో తలెత్తిన సమస్యల కారణంగా విదేశీ పెట్టుబడులు ఉరుగ్వేకు వచ్చినప్పటికీ అక్కడి ప్రమాణాల ప్రకారం చూస్తే నేరాలు, మాదక ద్రవ్యాల జాఢ్యం సవాలుగా మారింది. భద్రతలేదని జనం భావించారు. నేరగాండ్లను రాత్రిపూట అరెస్టుచేసేందుకు అనుమతించాలంటూ తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల కూటమి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లాటిన్ అమెరికాలో సురక్షితమైనదిగా ఒకప్పుడు పరిగణించిన ఉరుగ్వేలో ఇప్పుడు సంఘటిత నేరగాండ్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. అందుకే ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలలో 47శాతం మంది అభద్రత ప్రధాన సమస్యగా ఉందని చెప్పగా 18శాతం ఉపాధి, 12శాతం ద్రవ్యోల్బణం గురించి తెలిపారు. జీవన వ్యయం, ఆర్థిక అసమానతల పెరుగుదల వంటి సమస్యలను ఉరుగ్వే ఎదుర్కొంటున్నది. మితవాద ప్రభుత్వం 2030 నుంచి ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతామని చెప్పగా విశాల వేదిక 60 ఏండ్లుగా ప్రతిపాదించింది.పిల్లల్లో దారిద్య్రరేటు 25శాతం ఉంది.ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. తమకు అధికారమిస్తే వామపక్ష నూతన మార్గంలో అంటే మార్కెట్ అనుకూల, జనానికి సంక్షేమ విధానాలను, వ్యవసాయానికి పన్ను రాయితీలు ఇస్తామని అర్సీ వాగ్దానం చేశాడు.
గత వామపక్ష ప్రభుత్వాల పాలనలో అబార్షన్లను చట్టబద్దం కావించారు, స్వలింగ వివాహాలను అనుమతించారు. గత పదేండ్లుగా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో పెద్ద మార్పు లేకపోగా ఈడికగా సాగుతున్నది. ధనికుల గురించి గాక తమ గురించి విశాల వేదిక శ్రద్ధ చూపుతుందనే ఆశాభావాన్ని కార్మికవర్గం వ్యక్తం చేసిందనటానికి ఈ విజయం ఒక సూచిక అని చెప్పవచ్చు. దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. దేశ ఆర్థిక లోటును తగ్గించేందుకు నూతన ప్రభుత్వం ఏం చేయనుందనే ప్రశ్నలను పరిశీలకులు సంధిస్తున్నా రు. బలమైన ప్రభుత్వ పాత్ర ఉండాలని వామపక్ష వేదిక చెబుతున్నది.ధనికులపై పన్ను మొత్తాన్ని పెంచకుండా ఇది ఎలా సాధ్యమన్నది ప్రశ్న. అయితే ఈ అంశం గురించి ఎన్నికల ప్రచారంలో అర్సీ స్పష్టత ఇవ్వలేదు.ఆర్థిక వృద్ధి ద్వారా అదనపు రాబడిని సాధిస్తామని చెప్పాడు.వామపక్ష ప్రభుత్వాల పట్ల అమెరికా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పూర్వరంగంలో ఉరుగ్వే-చైనా సంబంధాలు ఎలా ప్రభావితం అయ్యేది చూడాల్సి ఉంది.చైనాకు ఎగుమతులపై ఉరుగ్వే ఎక్కువగా ఆధారపడి ఉంది.
– ఎం కోటేశ్వరరావు
8331013288