– సుప్రీంకోర్టుకు ఆవాజ్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రజల మధ్య మత విభజన పెంచేలా, ఘర్షణలను సృష్టించేలా, భారత న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానపరిచేలా ఉన్నాయని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ న్యాయమూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో ఒక న్యాయమూర్తి పాల్గొని చేసిన న్యాయ నిష్పాక్షికతను, రాజ్యాంగ విలువలను, సూత్రాలను దెబ్బతీసేలా చేసిన విద్వేష ప్రసంగం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని తెలిపారు. న్యాయమూర్తి ప్రయివేటు ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొని చేసిన విద్వేష ప్రసంగాలు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నిష్పాక్షికంగా న్యాయం అందించాల్సిన న్యాయమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఆ వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.