– ఇప్పుడు దుమ్మెత్తి పోసుకుంటున్నారు..కౌగిలించుకుంటున్నారు
– సభకు రాని వారి వేతనాలు కట్ చేయాలి
– చివరకు ప్రధాని తప్పు చేసినా తప్పని చెప్పే సంస్కృతి నాది : బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు లాంటి నాయకుల హయాంలో శాసనసభకు ఒక విలువ ఉండేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ అనేది పేకాట క్లబ్లులాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సభా వ్యవహారాల మీద తనకు అవగాహన ఉందని, ఇన్నాళ్లకు అసెంబ్లీకి వచ్చానని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దేవాలయానికి(అసెంబ్లీ) వచ్చాననే అభిప్రాయం కలిగిందని, సమస్యల పరిష్కారం కోసం అనుభవజ్ఞులు మాట్లాడతారని అనిపించిందని అన్నారు. కానీ, నెలకు రూ.2.75 లక్షల వేతనం తీసుకునే ప్రజాప్రతినిధులు కొందరు అసలు అసెంబ్లీకి రావడం లేదని, ఉద్యోగులు విధులకు రాకపోతే ఏ విధంగా వేతనం కట్ చేస్తారో.. అసెంబ్లీకి రాని వారి వేతనాలు అలాగే కట్ చేయాలన్నారు. ఇది ప్రజల సొమ్ము అన్నారు. తాను ఏ రోజు రాకున్నా.. అసెంబ్లీకి రిటర్న్ చేస్తా.. ఒకవేళ తీసుకోపోతే అసెంబ్లీ ముందు ప్రజలకు పంచుతానని చెప్పారు. రాజకీయ నాయకులకు ప్రజా సమస్యల పరిష్కారంపై కమిట్‌మెంట్ ఉండాలన్నారు. కానీ, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలను కాకుండా ఒకరిపై మరొకరు దుమ్మొత్తిపోసుకుంటూ.. మళ్లీ కౌగిలించుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ గేటు దగ్గర ఉన్న పోలీసులు వాననక, ఎండనక పని చేస్తుంటే వారికి రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, జీవో 317 సమస్య అలాగే ఉందని అన్నారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గడిచిన పదేండ్లలో కేంద్రం ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చిందో గత ప్రభుత్వం చెప్పలేదని, ఇప్పటి ప్రభుత్వం చెప్పదు అన్నారు. ఇవ్వలేదు అని మాత్రమే నింద వేస్తున్నారన్నారు. ఇచ్చిన నిధులు అసంపూర్తిగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ తప్పు చేసినా అది తప్పు అని చెప్పే సంస్కృతి నాది అని అన్నారు.