మంచం ఉన్న కాడికే కాళ్లు చాపుకోవాలె

Legs should be spread over the yoke of the bedఎంత ఉంటే అంతనే మెలగాలి. ఎవరి స్థాయి వాళ్లకు తెలుస్తది. కానీ ఆర్థిక స్తోమత మరిచి వ్యవహరించే వాళ్ళు ఉంటారు. అప్పులు చేసి తిప్పలు పడతారు. అటువంటి వాళ్ళని ఉద్దేశించి ‘మంచం ఉన్న కాడికే కాళ్లు చాపుకోవాలె’ అనే సామెత వాడుతారు. చిన్న మంచం మీద పొడుగు కాళ్లు ఉన్న ఆయన పడుకుంటే మలుసుకుని పడుకోవాలి గాని సాపు కొని పండుకోలేరు. ఈ సామెత ఉన్నంతలో జీవించడం వివరిస్తుంది. అట్లానే ‘మంచం సాటు ఉన్న కాడనే నీల్లాడమన్నట్టు’ అనే సామెత ఉంది. నీల్లాడటం అంటే ప్రసవించడం అని అర్థం. చిన్న చిన్న ఇండ్లలో పూర్వకాలంలో ప్రసవాలు జరిగేవి. అందుకు ఒక మంచం చాటు ఉండాలి. సాటు దొరికింది కాబట్టి డెలివరీ కావాలంటే అయితారా. ఇట్లాగ మాట్లాడే వాళ్ళును ‘మంచోడు మంచోడు అంటే మంచమెక్కి కూకున్నడట’. ఒకసారి మంచి పేరు వచ్చింది అంటే ఇగ వాళ్ళు ఆగరు మీది మీదికి పోతారు. అట్లాంటి సందర్భంలో వాడే సామెత ఇది. కొందరు చెప్పుడు మాటలు ఎక్కువ వింటారు. చెప్పినట్టు చేసి బొక్క బోర్ల పడతారు. ఇలాంటి వాళ్లను ‘మంది మాట విని మార్వానం పోతే మల్లొచ్చటాళ్లకు ఇల్లు కాలిపోయిందిట’. మర్వానం అంటే మరోసారి మనువాడడం అన్నట్టు. రెండో పెళ్లి చేసుకొనుడు. మంది మాట విని మళ్లీ పెళ్లి చేసుకుంటే అక్కడ నచ్చకుంటే తిరిగి వచ్చిందిట, వచ్చేవరకు ఇల్లు కాలిపోయిందట. పల్లె జనజీవనం నుంచి ప్రతి సందర్భంలోనూ సామెతలు పుట్టాయి. అవి ఆ కాలానికి సంబంధించినవని అర్థం చేసుకోవాలి.
– అన్నవరం దేవేందర్‌, 9440763479