– ఎస్సారెస్పీ కాలువలో ముగ్గురు యువకులు మృతి
– మృతులు పది, ఇంటర్ విద్యార్థులు
నవతెలంగాణ-ముప్కాల్/జక్రాన్‌పల్లి
ఆటవిడుపుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఆరుగురు యువకుల్లో ముగ్గురు లక్ష్మికాలువలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జక్రాన్‌పల్లి మండలం గన్యాతండాకు చెందిన ఆరుగురు యువకులు లోకేష్ (17), సాయినాథ్ (16), మున్నా (17), సబావత్ వంశీ, అజ్మీర సందీప్, భూక్య భాస్కర్ కారు తీసుకొని ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానానికని నది పరివాహక ప్రాంతమైన లక్ష్మీ కాలువలోకి దిగారు. వారిలో లోకేష్, సాయినాథ్, మున్నా నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. గమనించిన తోటి మిత్రులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముప్కాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్‌ఐ ముప్కాల్ భాస్కరాచారి, బాల్కొండ ఎస్‌ఐ కె.గోపి పర్యవేక్షించారు. బాల్కొండ ఎస్‌ఐ కె.గోపి గాలింపు చర్యల్లో భాగంగా కాలువలోకి స్వయంగా దిగి యువకుల కోసం తీవ్రంగా శ్రమించారు.
తండాకు చెందిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో గన్యాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మున్నా ప్రస్తుతం పదో తరగతి చదువుతుండగా.. లోకేష్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సాయినాథ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.