లెనిన్‌ ఓ..జ్ఞాపకం కాదు, వర్తమానం…

Lenin O.. not the memory but the present...”మనిషి కోసం మనిషి నడిచే చోటు ఒకటి ఉంటుందని
స్వేదం శిఖర సమానమయ్యే రోజు ఒకటి వస్తుందని
ఓల్గా నది ఒడ్డున మన కోసం కలలు కన్నవాడు
సైబీరియా కొండల్లో మన కోసం సమలోక ప్రణాళికను రచించినవాడు”
కామ్రేడ్‌ లెనిన్‌ జ్ఞాపకం కాదు…. వర్తమానం, మరణం ఎరుగని మార్క్సిస్టు జీవకణం..!!
లెనిన్‌ శత వర్ధంతిని 2024 జనవరి 21లో జరుపుకున్నాం. ఈ ఏడాదంతా శత వర్థంతి కార్యక్రమాలను నిర్వహించాం.ఆయన సైద్ధాంతిక కృషిని,విప్లవ కార్యాచరణను ఈ సందర్భంగా అధ్యయనం చేశాం.అయితే ఈ కృషిని ఇంతటితో ఆపకుండా నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రతి కమ్యూనిస్టు తను ఉన్న స్థల కాలలను (భౌతిక పరిస్థితులను) సరిగా అర్థం చేసుకోవాలి. విస్తారంగా అధ్య యనం చేయాలి. ఈ కృషిని లెనిన్‌ జీవిత కాలమంతా చేశాడు. రష్యన్‌ సమాజాన్ని సమగ్రంగా అధ్యయనం చేశాడు. గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో కలియ తిరిగాడు. పంట పొలాల మధ్య, ఫ్యాక్టరీ గొట్టాల మధ్య నలిగిపోతున్న అశేష శ్రామిక ప్రజల్లోని వర్గ వైరుధ్యాలను, ఐక్యతలను అవగాహన చేసుకున్నాడు. భూ ఎస్టేట్ల యజమానుల, పెట్టుబడిదారీ వర్గాల బలాలను, బలహీనతను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఈ మొత్తం సమగ్ర సాధారణ విషయాలను సైద్ధాంతీకరించాడు. గ్రంథాల రూపంలో ప్రపంచం ముందు ఉంచాడు. 23 సం.రాల వయసులోనే ,అంటే 1893లో లెనిన్‌ ”రష్యన్‌ రైతాంగ జీవితంలో నూతన ఆర్థిక పరిణామాలు” అనే మొదటి గ్రంథాన్ని రాశాడు.1894లో ”ప్రజా మిత్రులు నిజస్వరూపం” అనే మరో గ్రంథాన్ని రాశాడు. రైతాంగం ఏక వర్గంగా లేదని, రైతాంగంలో స్పష్టమైన వర్గ విభజన ఉందని నిరూపించాడు.అలాగే 1899లో ”రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి” అనే మహత్తర గ్రంథాన్ని రాశాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ పరిశ్రమల్లోనే కాక వ్యవసాయంలో కూడా ముందుకు వస్తోందని విశ్లేషించాడు.భూమి లేని గ్రామీణ ప్రజలు, స్వల్ప భూమి గల పేద రైతులు క్రమంగా పట్టణ కార్మికులుగా మారు తున్నారని చెప్పాడు. దేశంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందుతోందని తెలిపాడు. కేవలం రైతాంగమే విప్లవం తెస్తుందని వాదిస్తున్న నరోద్నిక్కుల సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. సంఖ్యరీత్యా చిన్నదైనా కార్మిక వర్గం ఆధునికమైనదని, అత్యంత చైతన్యవంతమైనదని తెలిపాడు.రైతాంగాన్ని, ఇతర శ్రామిక వృత్తిదారులని కలుపుకుని విప్లవానికి నాయకత్వం వహిస్తుందని సూత్రీకరించాడు. విప్లవం విజయవంతానికి ”కార్మిక కర్షక మైత్రి” చారిత్రక అవసరమని నిర్ధారించాడు.
సూత్రీకరణలు – నిర్ధారణలతో ఆగిపోదామా?
కమ్యునిస్టులుగా మన చుట్టూ ఉన్న భౌతిక పరిస్థితులను అర్థం చేసుకుంటే సరిపోతుందా? సూత్రీకరణలు, నిర్ధారణలతో ఆగిపోదామా? శుద్ధ సైద్ధాంతిక చర్చలతో కాలాన్ని గడిపేద్దామా? లెనిన్‌ అలా చేశాడా? చేయలేదు కదా. కార్మిక కర్షక మైత్రి మానవ విముక్తికి మార్గమని నిర్ధారించుకున్న లెనిన్‌ 1895లోనే నాటి రష్యా రాజధాని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ పట్టణ కేంద్రంగా విప్లవ కార్యచరణను ప్రారంభించాడు. దేశంలోని అన్ని రకాల కార్మిక, కర్షక, విద్యార్థి,మేధావి బఅందాలను సమన్వయపరిచి ”ఐక్య శ్రామిక విమోచన పోరాట సమితి” అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది ఒక రకంగా రష్యాలో విప్లవ కార్మిక వర్గ పార్టీ ఆవిర్భావానికి పునాది. ఈ సంస్థ ద్వారా లెనిన్‌ దేశవ్యాప్తంగా మార్క్సిస్టు భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు.స్టడీ సర్కిల్స్‌ నిర్వహించాడు.ఏడేండ్లపాటు ”అధ్యయన చర్చా” వేదికలను నడిపాడు. కజాన్‌ విశ్వ విద్యాలయం కేంద్రంగా యువ మార్క్సిస్టులకు సైద్ధాంతిక తర్ఫీదు ఇచ్చాడు. వారందరినీ స్థానిక కార్మిక కర్షక సంస్థల్లో చేరేలా ప్రోత్స హించాడు.విప్లవానికి అవసరమైన నిబద్ధత కలిగిన శ్రామిక వర్గ సైన్యాన్ని తయారు చేశాడు. ఉక్కు క్రమశిక్షణ కలిగిన రష్యన్‌ సోషల్‌ డెమో క్రటిక్‌ లేబర్‌ పార్టీ (ఆర్‌ఎస్‌డిఎల్‌పి) – (కమ్యూనిస్టు పార్టీ) నిర్మాణానికి పునాదులు వేశాడు.
ఆటంకాలను అవకాశాలుగా మార్చుకోవడం
సమాజాన్ని మార్చాలని ఉన్నత ఆశయం కలిగిన వాళ్లం,ఆటంకాలను చూసి అధైర్యపడ దామా? ఈ విషయంలో లెనిన్‌ మనకు ఏం నేర్పిస్తాడు? రష్యాలోని నాటి నిరంకుశ జారు ప్రభుత్వం నిత్యం లెనిన్‌ను వేటాడుతూ ఉండేది. అందులో భాగంగా 1897 ఫిబ్రవరి 13 నుండి 1900 జనవరి 29వ వరకు (3 సం.రాల పాటు) జారు ప్రభుత్వం లెనిన్‌ ను దేశ బహిష్కరణ చేసింది. తూర్పు సైబీరియాలో ఆయనకు ప్రవాస జైలు (జైలుశిక్షను) విధించింది.ఇంతటితో ఆగకుండా లెనిన్‌ అత్యంత ప్రమాదకర వ్యక్తి అని ఆయనను హత్య చేయాల్సిందిగా గూఢ చారులను ఆదేశించింది.జారీ ప్రభుత్వ కుట్రలను గమనించిన లెనిన్‌ జర్మనీలోని మ్యూనిచ్‌, లండన్‌ తదితర యూరప్‌ దేశాలకు వలస వెళ్లి ఐదేండ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. మరి మూడేండ్ల ప్రవాసకాలం, ఐదేండ్ల అజ్ఞాత కాలం లెనిన్‌ విప్లవ కార్యాచరణను ఆటంక పరిచిందా? జారు ప్రభుత్వం సృష్టించిన ఆటంకాలను, హత్యా ప్రయత్నాలు చూసి లెనిన్‌ అధైర్యపడ్డాడా? అలాగే లెనిన్‌ కేవలం జారు ప్రభుత్వ ఆటంకాలను కుట్రలను మాత్రమే ఎదుర్కొన్నాడా? కాదు. నరోద్నిక్కుల నుండి, ఆర్థిక వాదుల నుండి, సొంత పార్టీలోని మెన్షువిక్కుల నుండి సైతం ఆయన తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి తన రాజకీయ గురువు, రష్యన్‌ మార్క్సిస్టు పితామహుడిగా పేరున్న ఫ్లెఖనోవ్‌ లాంటి వారి నుండి సైతం లెనిన్‌ ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో పార్టీలో ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. అయితే ఈ ఆటంకాలన్నింటినీ లెనిన్‌ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆయుధంగా విసురుతూ అంతర్గత బాహ్య శత్రువుల ఆటంకాలను,కుట్రలను తుత్తునియలు చేశాడు. ఆయుధాన్ని విసరడంలో కూడా ఆయన అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.ఆ నైపుణ్యమే ”నిర్దిష్ట పరిష్థితితుల్లో నిర్దిష్ట విశ్లేషణ”. లెనిన్‌ అభివృద్ధి పరిచిన ఈ అద్భుత మార్క్సిస్టు నైపుణ్యాన్ని ప్రతి కమ్యూనిస్టు అలవర్చుకోవాలి.నిత్య కార్యాచరణలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించాలి.
ఈ నైపుణ్యంతోనే లెనిన్‌ విప్లవ విజయవంతానికి పార్టీ ఎంత అవసరమో గుర్తించాడు. అందులో భాగంగానే ”రష్యన్‌ సోషల్‌ డెమొక్రట్ల (కమ్యూనిస్టుల) కర్తవ్యాలు” అనే పుస్తకాన్ని రాశాడు.విప్లవ కార్యచరణకు ఐక్య కార్మిక వర్గ పార్టీ నిర్మాణం అవసరమని, దాని కర్త వ్యాలు ఎలా ఉండాలో చర్చ చేశాడు.అందుకు అవసరమైన సైద్ధాంతిక రచన చేయాలని భావించాడు.అదే ఆయన 1902లో రాసిన ప్రామా ణిక గ్రంథం ”ఏమి చేయాలి?” కార్మికవర్గం కేవలం ఆర్థిక పోరాటాలు చేయాలని,రాజకీయ పోరాటాన్ని పెట్టుబడిదారీ వర్గానికి వదిలివేయాలని ”ఆర్థికవాదులు” చేసిన అశాస్త్రీయ వాదనలను లెనిన్‌ ఈగ్రంథంలో తిప్పికొట్టాడు. ట్రేడ్‌ యూనియన్ల కార్యకలాపాలతో మాత్రమే విప్లవం రాదని, విప్లవ సాధనకు ఉక్కు క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంస్థ (పార్టీ) అవసరం అని నిర్ధారించాడు. అలాగే కార్మిక వర్గానికి నిత్యం అందే ఆర్థిక చైతన్యాన్ని కమ్యునిస్టు పార్టీ రాజకీయ చైతన్యంగా, చివరికి సోషలిస్టు చైతన్యంగా మార్చాలని నిర్దేశించాడు. సోషలిస్టు చైతన్యం రోజు వారి యాదృచ్ఛిక పోరాటాలు, ఉద్యమాల ద్వారా రాదని, బయట నుంచి ప్రత్యేకంగా అందించాలని చెప్పాడు. అందుకు పార్టీ ప్రత్యేకమైన కృషి చేయాలని తెలిపాడు.
నిరాశ విప్లవ లక్షణం కానే కాదు
కమ్యునిస్టులకు ఓట్లు రావడం లేదు.సీట్లు గెలవడం లేదు. ప్రజలు కమ్యూనిస్టులను ఆదరించడం లేదు.కమ్యూనిస్టుల పని అయిపోయింది.ఇలాంటి మాటలను నేడు మనం నిత్యం వింటున్నాం. అక్కడక్కడా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ స్థాయిల్లో సైతం, ఇంకా ఏం చేస్తాంలే…గతంలో చేసాం. అప్పుడు ప్రజలు మనల్ని ఆదరించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇలా నిరాశ నిస్పృహ,నైరాశ్యంతో కూడిన చర్చలు జరుపుతున్నారు. నిరాశ విప్లవ కార్యాచరణకు అసలు సిసలు ఆటంకం. నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషణ చేయలేకపోవడం వల్లనే నిరాశ మనల్ని చుట్టు ముడుతుంది. మరి నిరాశ , విప్లవ నైర్యాశ్యం మన కాలానికి మాత్రమే సంబంధించినదా? లెనిన్‌ ఈ పరిస్థితులని ఎదుర్కోలేదా? ఎదుర్కొన్నాడు. అయితే లెనిన్‌ నిరాశని ”విప్లవ విశ్వాసంతో” అధిగమించాడు.నైరాశ్యం విప్లవ లక్షణం కాదని నిరూపించాడు. అందుకు ఆయన జీవితకాల కృషిలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా 1905 సం.లో రష్యాలో బూర్జువా విప్లవం విఫలం అయినప్పుడు మొత్తం కార్మికవర్గ శ్రేణులు, పార్టీ సభ్యులు,కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. నిరంకుశ జారు ప్రభుత్వ అణిచివేత చర్యలను తట్టుకోలేక విప్లవ శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. పార్టీ సభ్యులు సైతం పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని వదులుకున్నారు.అయితే ఈ స్థితిని చూసి లెనిన్‌ బెంబేలెత్తిపోలేదు.ఇక ఏం చేస్తాంలే అని….జెండా వదిలేయలేదు. ఆ నిరాశ , నిస్పృహ స్థితిని శాస్రీయంగా విశ్లేషించాడు. బూర్జువా విప్లవం పూర్తిగా విఫలం కాలేదని నిర్దారించాడు. అసలు ఏ ప్రజా పోరాటం అయినా విఫలం కాదని వాదించాడు.ప్రతి ప్రజా పోరాటం భవిష్యత్‌ పోరాటాలకు ఊతమిస్తుందని పేర్కొన్నాడు. అయితే అది అన్నిసార్లు పైకి కనిపించదని విశ్లేశించాడు.1905లో జరిగిన బూర్జువా విప్లవం పూర్తిగా విఫలం కాలేదని, ఇది భవిష్యత్తు సోషలిస్టు విప్లవానికి ”డ్రస్‌ రిహార్సల్‌ ” అని పేర్కొన్నాడు. ఈ శాస్త్రీయ అవగాహన నుంచే లెనిన్‌ 1907 నుండి 1914 వరకు కార్మిక కర్షక శ్రేణులను ఉత్సాహపరిచాడు. ”అంతిమ విజయం మనదేనని ప్రజలదేనని” ప్రకటించాడు.
అందిన అవకాశాన్ని అసలే వదులుకోవద్దు
విప్లవ కార్యాచరణలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తకి, పార్టీకి కొన్ని సందర్భాల్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆ సమయంలో వాటిని అందుకోలేకపోతే, సక్రమంగా వినియోగిం చుకోకపోతే వెనకబడిపోతాం. దశాబ్దాల పాటు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుంది.1914 లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధాన్ని యూరప్‌లోని అన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ (కమ్యూనిస్టు పార్టీలు) జాతీయ వాద యుద్ధాలుగా భావించాయి. ఒక్క సెర్బియా కమ్యునిస్టు తప్ప. కానీ లెనిన్‌ ఈ యుద్ధం ”సామ్రాజ్యవాద యుద్ధం” అని సూత్రీకరించాడు. కార్మికవర్గ శత్రువులైన పెట్టుబడిదారులు తమలో తాము ప్రపంచాన్ని లాభాల కోసం పంచుకోవాలని యుద్ధానికి తెగబడుతున్నాయని, ఇది కమ్యునిస్టులకు అధ్భుత అవకాశం అని తెలిపాడు. ఈ సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్గత యుద్ధాలుగా మార్చాలన్నాడు. తన వాదనను శాస్త్రీయంగా నిరూపించడం కోసం 1916లో ”సామ్రాజ్య వాదం- పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ” అన్న గ్రంథాన్ని రాశాడు.అయితే లెనిన్‌ చేసిన విశ్లేషణను అర్ధ్థం చేసుకోకుండా దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీలు ”కుహానా దేశభక్తి మురికి కూపంలో” మునిగిపోయాయి. లెనిన్‌ మాత్రం అందిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించాడు.అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రచించాడు.1917 మార్చి 8వ తేదీన, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రష్యన్‌ బోల్షివిక్‌ పార్టీని కదం తొక్కించాడు. నిరంకుశ జారు ప్రభుత్వాన్ని కూల దోశాడు.బూర్జువా ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేశాడు.
1917 మార్చిలో విజయవంతమైన బూర్జువా ప్రజాతంత్ర విప్లవాన్ని లెనిన్‌ సోషలిస్టు విప్లవంగా మార్చాలని భావించాడు. అయితే మెన్షివిక్కులు ఇతర కామ్రేడ్స్‌ లెనిన్‌ ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకించారు. సోషలిస్ట్‌ విప్లవం ఇప్పుడు అసాధ్యమని వాదించారు. లెనిన్‌ మాత్రం సోషలిస్ట్‌ విప్లవానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అందివచ్చిన ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ధారించాడు. కార్యాచరణ ప్రణాళికను బోల్షివిక్‌ పార్టీ కేంద్ర కమిటీలో ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనే ”ఏప్రిల్‌ థీసిస్‌”గా ప్రసిద్ధి చెందింది. పెట్టుబడిదారీ వర్గం చేతిలోని అధికారాన్ని శ్రామిక వర్గం అందిపుచ్చు కోవాలని పేర్కొన్నాడు.అయితే లెనిన్‌ చేసిన విశ్లేషణలను బోల్షివిక్‌ పార్టీలోని పొలిట్‌ బ్యూరో సభ్యులు సైతం సరికావని కొట్టిపడేశారు. చివరికి లెనిన్‌ జీవిత సహచరి కామ్రేడ్‌ కృపస్కయ సైతం లెనిన్‌కు ”పిచ్చిగాని పట్టలేదు కదా” అని వ్యాఖ్యానిం చింది. అయినా లెనిన్‌ అందివచ్చిన అవకాశాన్ని కచ్చితంగా వినియోగించుకోవాల్సిందే అనే నిర్ణయించాడు.1917 అక్టోబర్‌ 7న పెట్రోగాడ్‌కి చేరుకొని విప్లవానికి ప్రత్యక్ష నాయకత్వం వహించాడు.బోల్షివిక్‌ పార్టీ శ్రేణులను ముందుకు నడిపాడు.తొలి సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేశాడు. అంతేకాక విప్లవం విజయవంతమైన తర్వాత విప్లవ వ్యతిరేక శక్తులను ధీటుగా ఎదుర్కొన్నాడు. సోషలిజం ఫలితాలను ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు రచించాడు. మనలాంటి వలస దేశాల్లో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాలకు స్ఫూర్తినిచ్చాడు.
మానవాళి శ్రేయస్సు కోసం విరామమెరుగక శ్రమించిన విప్లవకారుడు చివరికి 1924 జనవరి 21వ తేదీన తుదిశ్వాస విడిచాడు. కేవలం 54 సం.రాలు మాత్రమే జీవించి ”మా సిద్ధాంతం పిడివాదం కాదు అది ఆచరణకు కరదీపిక” అన్న మార్క్స్‌,ఎంగిల్స్‌ల మాటల్ని నిజం చేసి చూపించాడు కామ్రేడ్‌ లెనిన్‌. ఆయన మరణించి వంద సంవత్సరాలు అయినా, ప్రతి ప్రజా పోరాటంలో తాను మనతో కలిసి నడుస్తున్నాడు.మనల్ని నడిపిస్తున్నాడు. విప్లవ కార్యాచరణలో ఆటంకాలు వచ్చిన ప్పుడల్లా, నిరాశ మనల్ని చుట్టు ముట్టినప్పుడల్లా మనకు గుండెధైర్యాన్ని అందిస్తున్నాడు. ఓమహత్తర ”విప్లవ పాఠ్య పుస్తకమై” మన ”కార్యాచరణ గ్రంథాలయంలో” మొదటి వరుసలో నిలబడుతున్నాడు.ఆయన ఆశయ సాధనకు నిరంతరం..’విప్లవ పయనం’ చేయడమే ఆయనకు కమ్యూనిస్టు కార్యకర్తలుగా మనమిచ్చే నిజమైన నివాళి.
(కామ్రేడ్‌ లెనిన్‌ శత వర్థంతి ముగింపు సందర్భంగా)
బండారు రమేష్‌
9490098251