నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కమ్యూనిస్టు మహోపాధ్యాయుల్లో ఒకరైన విఐ లెనిన్ శత వర్ధంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఆదివారం ఢిల్లీలో సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు విఐ లెనిన్‌కు ఘన నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో లెనిన్ విగ్రహానికి సీపీఐ(ఎం) నేత, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, పొలిట్ బ్యూరో సభ్యులు సూర్యకాంత్ లెనిన్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా బిమన్ బసు మాట్లాడుతూ లెనిన్ జీవిత చరిత్రను వివరించారు. త్రిపుర అగర్తలలోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితిన్ చౌదరి సహా పార్టీ నేతలు లెనిన్ చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లెనిన్ వర్ధంతి నిర్వహించారు. తమిళనాడులోని చెన్నైలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌తో సహా పార్టీ నేతలు నివాళులు అర్పించారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాతో సహా వివిధ రాష్ట్రాల్లో విఐ లెనిన్ శత వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.