ప్రపంచంపై లెనిన్‌ ప్రభావం : కూనంనేని

ప్రపంచంపై లెనిన్‌ ప్రభావం : కూనంనేనినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
లెనిన్‌ మరణించి వందేండ్లు నిండినా ఇప్పటికీ ప్రపంచంపై ఆయన ప్రభావం, ప్రాసంగికత ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. లెనిన్‌ శత వర్థంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో వర్థంతి సభ నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, వి.ఎస్‌.బోస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాంబశివ రావు మాట్లాడుతూ చరిత్రలో కారల్‌ మార్క్స్‌ పేరు ఉంటే ఆయన పక్కన లెనిన్‌ పేరు ఉండాల్సిందే అన్నారు. మార్క్సిజం లెనినిజం పేరుతో లెనిన్‌ ప్రపంచ మానవాళికి, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి, కార్మిక వర్గానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికి మరపురానివన్నారు. మార్క్స్‌, ఎంగెల్స్‌ ‘ దాస్‌ క్యాపిటల్‌’ రాయటంలో చేసిన కృషి మరిచిపోలేనిదన్నారు. ఆ సిద్ధాంతానికి ఇద్దరు కవలలుగా పనిచేశారని తెలిపారు. మార్క్సిజం సిద్ధాంతానికి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ స్వరూపాన్ని లెనిన్‌ అందించారన్నారు. చాడ మాట్లాడుతూ లెనిన్‌ బాటను అనుసరించటమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లెనిన్‌ ఆచరించిన, అమలు పరిచిన ఆయన ఆలోచన విధానాన్ని సర్వత్ర ఆత్మలోకనం చేసుకొని, లెనిన్‌ చూపిన బాటలో నడిచేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా నాట్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌, పల్లె నర్సింహ్మా, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.