కుష్టు వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే చికిత్సలకు సులువుగా ఉంటుందని డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ సాధన అన్నారు. జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఖుర్షీద్ నగర్ అర్బన్ పీహెచ్సీలో కార్యక్రమం నిర్వహించారు. గాంధీ వర్ధంతిని సందర్భంగా గాంధీ చిత్రపటం, కుష్టువ్యాధి కారక క్రిమిని గుర్తించిన శాస్త్రవేత్త డాక్టర్ హాన్సన్ చిత్రపటానికి పులమాలలు వేసి జ్యోతి ప్రజ్వల చేశారు. అనంతరం కుష్టు గుర్తింపు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ సాధన మాట్లాడుతూ… కుష్టు రహిత సమాజం కోసం ఆశా, ఏఎన్ఎంలు కృషి చేయాలన్నారు. సర్వే కోసం ఇంటింటికి వెళ్తున్న క్రమంలో ఒక దాని కోసం కాకుండా అన్ని వ్యాధుల గురించి తెలుసుకోవాలని సూచించారు. గతంలో కేసులు పెరిగిన నేపథ్యంలో ముందస్తుగా కుష్టు గుర్తింపుకు కృషి చేసి త్వరగా నయం చేసేల చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెల 18వ తేది వరకు స్పర్మ్ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే అంగవైకల్యం కాకుండా ఉంటుందని ప్రజలకు తెలియజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ అధికారి సుమలత, ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రొగామ్ అధికారి గజనంద్, డీఐఓ వైసీ శ్రీనివాస్, వైధ్యాధికారి అన్సారీ, డీపీఎంఓలు వామన్ రావు, రమేష్, ఎల్ నిజామోద్దీన్, సీఓ ప్రశాంత్ దేశపాండే, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.